- తెలుగు, ఉర్దూ మీడియం వారికి చాయిస్
- ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు ఇంగ్లిష్‌లోనే
- ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష
- 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్ ఎంట్రెన్స్
తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు మూడు భాషల్లో (ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ) ప్రశ్నపత్రాలను రూపొందించారు. దరఖాస్తు సమయంలో విద్యార్థులు ఎంచుకున్న మాధ్యమాన్ని బట్టి తెలుగు మీడియం వారికి తెలుగు లేదా ఇంగ్లిష్ ప్రశ్నాపత్రాన్ని.. ఉర్దూ మీడియం వారికి ఉర్దూ లేదా ఇంగ్లిష్ ప్రశ్నాపత్రాన్ని ఇవ్వనున్నారు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు కేవలం ఇంగ్లిష్ ప్రశ్నాపత్రాన్నే ఇస్తారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశపరీక్షలు 9, 10 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షలకు తెలంగాణలో 82, ఏపీలో 23, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం హాల్‌టికెట్‌పై పరీక్షా కేంద్రాల రూట్‌మ్యాప్‌ను ముద్రించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 2,51,606 మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 1,99,758 మంది, ఏపీలో 51,848 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్‌లో 1.64 లక్షల మంది, అగ్రికల్చర్, మెడిసిన్‌లో 86 వేల మంది పరీక్షలు రాయబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి
ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు తమకు జ్వరం, జలుబు, దగ్గు లాంటి కొవిడ్ లక్షణాలేవీ లేవని నిర్ధారిస్తూ విధిగా స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సమర్పించిన వారినే పరీక్షకు అనుమతిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పాటించాల్సిన కొవిడ్ మార్గదర్శకాలను ఎంసెట్ హాల్‌టికెట్ల వెనకవైపున ముద్రించారు. హాల్‌టికెట్‌పై ఫొటో అంటించి, గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించాలన్న నిబంధనను తొలిగించడంతో విద్యార్థులు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ అవసరం లేకుండానే పరీక్షకు హాజరుకావొచ్చు. కానీ విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
నేటి వరకు హాల్‌టికెట్లు
విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఎంసెట్ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే గడువును జూలై 31 తేదీ నుంచి ఆగస్టు 2 వరకు పొడిగించారు. పరీక్ష ముగిసిన మూడు రోజుల్లో ‘కీ’ విడుదల అవుతుంది. అనంతరం విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, 15 రోజుల్లో ఫలితాలను ప్రకటించనున్నారు.
కుల ధ్రువీకరణకు మరో అవకాశం
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో రిజర్వేషన్ కోసం కుల ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయని విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. ఇలాంటివారంతా మీ-సేవా కేంద్రం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రాన్ని పరీక్షా కేంద్రాల్లో సమర్పించవచ్చు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు విధిగా మాస్కును ధరించి బాల్‌పాయింట్ పెన్ను, ప్రింట్‌తీసిన దరఖాస్తు, హాల్‌టికెట్, శానిటైజర్ బాటిల్, నీళ్ల బాటిల్‌ను మాత్రమే హాల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.
9 సెషన్లల్లో పరీక్షలు
ఈ ఏడాది ఎంసెట్‌ను 9 సెషన్లల్లో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు 6, మెడికల్, అగ్రికల్చర్ విద్యార్థులకు 3 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి. ఒక్కో సెషన్‌లో 28వేల మందికి పరీక్షలు నిర్వహిస్తారు. వేర్వేరు సెషన్లుగా పరీక్షలను నిర్వహించడం వల్ల ఒక సెషన్‌లో ప్రశ్నాపత్రం కఠినంగా, మరో సెషన్‌లో సులభంగా వచ్చి విద్యార్థులు నష్టపోయే ప్రమాదముండటంతో నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా దీన్ని సరిదిద్దనున్నారు. ప్రశ్నపత్రం కఠినంగా ఉన్న సెషన్‌లో మార్కులు తగ్గించడం, సులభంగా ఉన్న సెషన్‌కు మార్కులు పెంచడం ద్వారా సర్దుబాటు చేస్తారు. ఇందుకు ప్రత్యేక ఫార్ములాను అనుసరించనున్నారు.
కొవిడ్ బాధితులకు ప్రత్యేక పరీక్ష
ఎంసెట్‌కు హాజరయ్యేవారిలో కొంత మంది కొవిడ్ బారినపడినట్లు సమాచారమందింది. ఇప్పటికే ఇలాంటి ఇద్దరు విద్యార్థులు మమ్మల్ని సంప్రదించారు. ఉన్నతాధికారులను సంప్రదించి వీరికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తాం. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ చొప్పున నియమించాం. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆలస్యంగా వస్తే పరీక్షకు అనుమతించే ప్రసక్తే లేదు.
- ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, తెలంగాణ ఎంసెట్ కన్వీనర్
1,500 మందికి పరీక్ష షెడ్యూల్ మార్పు
ఎంసెట్, బిట్‌శాట్ రెండు పరీక్షలు ఒకే సమయంలో జరగనుండటంతో విద్యార్థులకు ఎంసెట్ తేదీలను మార్చుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో 1,500 మందికిపైగా విద్యార్థుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 4వ తేదీన బిట్‌శాట్ ఎగ్జామ్ ఉన్న వారికి 5 లేదా 6 తేదీల్లో ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించారు.