జాతీయం

ఆయ‌న ఇప్పుడు భారత్‌లో హీరో అయ్యారు

పీవీ సింధు కొత్త కోచ్‌పై కేంద్ర మంత్రి రిజిజు ప్ర‌శంస‌ల జ‌ల్లు

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి స్వదేశానికి చేరుకున్న నేప‌థ్యంలో ఢిల్లీలో త‌న కోచ్ పార్క్ తే సంగ్ తో క‌లిసి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును క‌లిసింది. ఈ సంద‌ర్భంగా కోచ్ పార్క్‌పై కిర‌ణ్ రిజిజు ప్రశంసలు కురిపించారు. పార్క్‌కు కృతజ్ఞతలు చెబుతున్నాన‌ని, ఆయ‌న ఇప్పుడు భారత్‌లో హీరో అయ్యారని రిజిజు అన్నారు. ప్రతి భారతీయుడికి పార్క్‌ గురించి తెలిసింద‌ని ఆయ‌న చెప్పారు.

పీవీ సింధు త‌న కోచ్‌తో క‌లిసి త‌న‌ను క‌లిసింద‌ని చెబుతూ రిజిజు ట్వీట్ చేశారు. పీవీ సింధుకు అండ‌గా నిలుస్తోన్న‌ తల్లిదండ్రులు, బ్యాడ్మింటన్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాల‌కు కూడా రిజిజు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నేడు ప్రధాని మోడీని పీవీ సింధు కలిసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అనంత‌రం ఆమె హైదరాబాదుకు రానుంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, అభిమానులు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.