ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ప్రధాని మోదీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె.. అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ప్రధాని మోడీ తీరు ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేది, కుల,మతాల మధ్య చిచ్చు పెట్టేది, విభజన రాజకీయాలు చేసేది బీజేపీనే అని విమర్శలు గుప్పించారు. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ బీజేపీ అంటూ ఫైర్ అయ్యారు. మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ అని అన్నారు.మతాన్ని కవచంలా అడ్డుపెట్టుకుని దర్జాగా దేశాన్ని దోచుకుంటోందంటూ విమర్శలు గుప్పించారు షర్మిల. దోస్తులకు సంపదను దోచిపెడుతూ.. కాంగ్రెస్‌ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోడీ అనడం, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుంది హర్యానాలో బీజేపీ విజయం అని షర్మిల సెటైర్లు వేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా.. ప్రజల మనసులో బలంగా నాటిన ప్రేమ, ఐక్యత సందేశం క్రమంగా ఉద్యమంగా, ఉప్పెనగా మారుతోందని బీజేపీ తెలుసుకోవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను ప్రజల మనసులను గెలిచిందనే విషయాన్ని బీజేపీ గ్రహించాలన్నారు.నఫ్రత్ – మొహబ్బత్‌కు మధ్య జరిగిన యుద్ధంలో ప్రేమనే గెలిచిందన్నారు షర్మిల. జమ్మూకాశ్మీర్‌లో తెరుచుకున్న ‘మొహబ్బత్ కి దుకాణ్’ లు రేపటి రోజున దేశం మొత్తం తెరుచుకుంటాయన్నారు. మోడీ హఠావో.. దేశ్ బచావో అనే నినాదం నిజమవుతుందన్నారు. 10 ఏళ్లుగా దేశం వెలుగుతుందని పచ్చి అబద్ధాలు చెప్తున్న మోడీ.. ‘విశ్వగురు కాదు.. విష పురుగు’ అని ప్రజలకు అర్థం అవుతోందంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేశారామె. విద్వేషాన్ని పెంచేది మోడీ.. ప్రేమను పంచేది రాహుల్ అని అన్నారు.‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తుంటే.. కుల, మతాల మధ్య విభజన తెచ్చి ఊచకోత కోస్తుంటే.. ఎదిరించిన గొంతుకలను, నక్సల్స్, టెర్రరిస్టులు, హిందూ వ్యతిరేకులుగా పోల్చుతుంటే.. హక్కుల పరిరక్షణకు, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అని దేశం నమ్ముతుంది.

ఈ నమ్మకమే 2029లో దేశాన్ని కాంగ్రెస్ నిలబెడుతుంది. ప్రధానిగా రాహుల్ గాంధీని దేశం చూస్తుంది. అన్ని వర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ అందించేది ఆపన్న హస్తం, వాడిపోవటానికి అతి చేరువలో ఉన్నది కమలం.’ అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు షర్మిల.