జాతీయం ముఖ్యాంశాలు

రతన్ టాటాకు ఘన నివాళి

ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాపార్థీవ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లోని రతన్ టాటా భౌతిక కాయం ఎదుట పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో పాటు, గ్రూప్ ఉన్నతాధికారులు, టాటా కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రతన్ టాటా లాంటి మహోన్నత వ్యక్తి ఈ లోకాన్ని వీడిపోవడం తీరని లోటని అన్నారుప్రజల సందర్శనార్థం రతన్ టాటా పార్థీవ దేహాన్ని ముంబయిలోని NCPA గ్రౌండ్‌లో ఉంచగా.. అనంతరం ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. గ్రౌండ్ నుంచి వర్లీ వరకూ యాత్ర సాగనుంది. వర్లీ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో రతన్ టాటా పార్థీవ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కడసారి ఆ మహనీయుణ్ని చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అటు, కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరయ్యారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా (86) ముంబైలో బుధవారం తుదిశ్వాస విడిచారు.

రెండు రోజుల కిందట ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మరణంపై ప్రముఖులు సంతాపం తెలిపారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఆయన మరణంపై భావోద్వేగ లేఖ రాశారు.1937 డిసెంబర్‌ 28న రతన్‌ టాటా.. నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 1991లో టాటా గ్రూపు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి రతన్ టాటా సంస్థను ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. 2 దశాబ్దాల అనంతరం 2012లో టాటా గ్రూప్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. 1996లో టెలికమ్యూనికేషన్స్ కోసం టాటా టెలీ సర్వీసెస్‌ని స్థాపించగా, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)గా రూపాంతరం చెందింది. 2016 అక్టోబర్ నుంచి 6 నెలల పాటు టాటా గ్రూప్‌నకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను 2000లో అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ 2008లో ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. మహారాష్ట్ర, అస్సాం ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకున్నారు.
హిందూ సంప్రదాయంలోనే అంత్యక్రియలు
రతన్‌టాటా పార్సీ మతస్తుడు కాబట్టి.. జొరాస్ట్రియన్‌ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయంలో నిర్వహించనున్నట్లు తెలిసింది.  అంతకుముందు సెప్టెంబర్ 2022లో, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. ఎందుకంటే కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో, పార్సీ సమాజం అంత్యక్రియల ఆచారాలపై నిషేధం విధించారు.ఒకప్పుడు.. ప్రస్తుత ఇరాన్‌లో నివసించిన పార్సీ కమ్యూనిటీకి చెందిన కొద్దిమంది మాత్రమే ప్రపంచం మొత్తంలో మిగిలిపోయారు. 2021లో నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రపంచంలో పార్సీల సంఖ్య 2 లక్షల కంటే తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన అంత్యక్రియల సంప్రదాయం కారణంగా ఈ సంఘం ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

టవర్ ఆఫ్ సైలెన్స్‌కు సరైన స్థలం లేకపోవడం, డేగలు, రాబందులు వంటి పక్షులు దాదాపు అంతరించిపోవడంతో.. గత కొన్నేళ్లుగా పార్సీ ప్రజలు అంత్యక్రియల తీరును మార్చుకోవడం ప్రారంభించారు.పార్సీలలో అంత్యక్రియల సంప్రదాయం 3 వేల సంవత్సరాల నాటిది. వేల సంవత్సరాల క్రితం పర్షియా (ఇరాన్) నుండి భారతదేశానికి వచ్చిన పార్సీ సమాజంలో, మృతదేహాన్ని కాల్చడం లేదా పాతిపెట్టడం లేదు. పార్సీ మతంలో, మరణం తర్వాత, టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలువబడే సాంప్రదాయ స్మశానవాటికలో రాబందులు తినడానికి శరీరాన్ని బహిరంగ ప్రదేశంలో వదిలివేస్తారు. రాబందులు మృత దేహాలను తినడం కూడా పార్సీ సమాజ ఆచారంలో ఒక భాగం.
పార్సీ సమాజంలో అంత్యక్రియలు ఎలా చేస్తారు?
ప్రకృతిని గౌరవిస్తూ, పవిత్రతను పాటిస్తూ, ప్రాచీన ప్రక్రియలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రేతాత్మల వల్లే మరణం సంభవిస్తుందనీ, మరణం తర్వాత శరీరం అపవిత్రం అవుతుందని జొరాస్ట్రియన్ల నమ్మకం. ఆత్మ సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా, ఆధ్యాత్మిక, భౌతిక పవిత్రతపై దృష్టిపెడతారు.
1. భౌతికకాయాన్ని శుభ్రం చేయడం : భౌతికకాయానికి స్నానం చేయించి, సాధారణ తెలుపు దుస్తులు ధరింపజేస్తారు. ఫారసీ ప్రముఖులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దుష్టశక్తులు దాడిచేయకుండా ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఒక తెల్లని శునకాన్ని తీసుకొస్తారు. భౌతిక కాయం పక్కన ఆ శునకాన్ని ఉంచుతారు. ప్రేతాత్మలను ఈ శునకం ఎదుర్కొంటుందని నమ్ముతారు.
2. ప్రజల సందర్శన కోసం డెడ్‌బాడీ : ఆ తర్వాత డెడ్‌బాడీని ఇంట్లో ఉంచుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ డెడ్‌బాడీని సందర్శిస్తారు. అయితే ఆ డెడ్‌బాడీ ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తపడతారు. చనిపోయిన ఆత్మ సాఫీగా ప్రయాణించడం కోసం ప్రార్థనలు నిర్వహిస్తారు. తప్పులేమైనా ఉంటే క్షమించాలని కోరతారు.
3. అంత్యక్రియల కోసం ఊరేగింపు : ఆ తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళతారు. ఈ సమయంలో డెడ్‌బాడీకి ప్రార్థనలు చేస్తారు.
4.టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ : జొరాస్ట్రియన్‌ సంప్రదాయం ప్రకారం, డెడ్‌బాడీని టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌కి తీసుకెళతారు. అక్కడ బహిరంగ, ఏకాంత స్థలంలో మృతదేహాన్ని ఉంచుతారు. భూమి, అగ్ని పవిత్రత దెబ్బతినకుండా, సహజ పద్ధతిలో డెడ్‌బాడీ కుళ్లిపోతుంది. ఈ మృతదేహాన్ని రాబందులు ఆరగిస్తాయి.
5. ఆత్మ ప్రయాణానికి ప్రార్థనలు: టవర్‌ ఆఫ్‌ సైలెన్స్‌ దగ్గర డెడ్‌బాడీని ఉంచిన తర్వాత, మూడు రోజుల పాటు ప్రార్థనలు నిర్వహిస్తారు. అంటే మూడు రోజుల్లో, శరీరం నుంచి ఆత్మ వేరుపడుతుందని ఫారసీల నమ్మకం.
6. సంతాప సమయం : జొరాస్ట్రియన్‌ పద్ధతి ప్రకారం, ఒక వ్యక్తి మరణించిన తర్వాత నాలుగోరోజు, పదోరోజు, 13వ రోజునాడు సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తారు.