తెలంగాణ భవన్ లో నగర ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో మూసీ ప్రాజెక్టు పైన కేటీఆర్ సమావేశం నిర్వహించారు. తరువాత మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్ లో పేదలు దిగువ మధ్యతరగతి ప్రజలు సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆనాలోచితంగా, ప్రణాళిక లేకుండా పేదలకు ఎవరూ అండగా లేరన్నట్లుగా దూకుడుగా వారి మీదకు వెళ్తోంది. మోడీ నోట్ల రద్దు చేసినప్పుడు ఏ విధంగా రకరకాల కారణాలు మారుస్తూ చెప్పారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్దతి అవలంభిస్తోంది. ఒక రోజు మూసీ సుందరీకరణ అంటారు. ఒక రోజు నల్గొండకు నీళ్లు అంటారు. ఒక రోజు రూ. లక్షా 50 వేల కోట్లు ఎక్కడివి అంటారు. ఒక రోజు డీపీఆర్ లేనే లేదంటారని అన్నారు. ఒక ప్రణాళిక, ఆలోచన లేకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితమే పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు వాటిని కూలగొడతామని దుందుడుకుగా పోతామంటే కుదరదు. హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఒక భయానక వాతావారణాన్ని సృష్టించారు.
హైడ్రాను పెద్ద, పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే ఉపయోగిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మూసీ పేరిట ఏ విధంగా లూటీ చేస్తున్నారో ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మూసీ కి సంబంధించి 100 శాతం మురుగు నీటి శుద్ది ప్లాంట్లను మేము రూ. 4 వేల కోట్లతో నిర్మించామని అన్నారు.
మూసీ శుద్ది మేము చేశాం. దీంతో ఇక నల్గొండ జిల్లాకు వెళ్లే నీళ్లన్ని శుద్ది చేసిన నీళ్లే వెళ్తాయి. దాని కోసం కొత్తగా ఖర్చు చేయాల్సిన పని లేదు. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట్ కు నీళ్లు తెచ్చేందుకు 11 వందల కోట్లు ఖర్చు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇక రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. నల్గొండకు మంచి నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు మేము చేశాం. ఇక నల్గొండ కు నీళ్లు ఇచ్చే ఇష్టం లేదా అంటూ ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. గతంలోనే మేము మూసీ సుందరీకరణ చేపట్టాలని సుధీర్ రెడ్డి ఛైర్మన్ గా ప్రయత్నం చేశాం. కానీ గరీబోళ్లకు అన్యాయం జరుగుతదంటే ఆ ప్రాజెక్ట్ వద్దని కేసీఆర్ చెప్పారు. మానవీయ ముఖ్యమంత్రి ఉంటే ఆ విధంగా నిర్ణయాలు ఉంటాయి. మూసీ సుందరీకరణ మేము కూడా చేశాం. కానీ ఒక్క పేదవాడి కడుపు కూడా కొట్టలేదు. మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లు ఎందుకో చెప్పాలి. 50 ఏళ్ల క్రితం పట్టాలిచ్చిన వారిని హైడ్రా పేరుతో కూల్చివేస్తామంటే కుదరదు, మీరు చేసిన తప్పునకు పేదలను బలి చేస్తారా? మీరే పట్టాలిచ్చి మీరే కూలగొడుతారా అని ప్రశ్నించారు. పేదలకు ఎవరు దిక్కు లేరన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు. భైదరాబాద్ లోని పేదలకు బీఆర్ఎస్ రక్షణ కవచంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా మా నాయకులు ఉంటారు. మేము నిర్మించిన అన్ని ఎస్టీపీలను కూడా మా ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటిస్తామని అన్నారు.
మా ప్రభుత్వం ఉన్నప్పుడు నాలా డెవలప్ మెంట్ కార్యక్రమం తీసుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలను కూడా సందర్శిస్తాం. హైడ్రా పేరుతో ప్రభుత్వం భయపెడుతున్న అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు మేము భరోసా ఇస్తాం. అదే విధంగా ప్రభుత్వం చట్టాన్ని గౌరవించకపోతే మేము న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. ఆర్ఎస్ లీగల్ సెల్ కు దాదాపు 450 మంది వచ్చి అండగా ఉండాలని కోరారు. మా పార్టీ లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేస్తాం. లీగల్ సెల్ వాళ్లు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి అభినందనలు. ఈ ప్రభుత్వం చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రజలను కబ్జాదారులు అంటున్న విధానాన్ని ఎండగడతాం, హైడ్రా కారణంగా భయానక వాతావారణం వచ్చింది. మొన్న హైడ్రా పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం నాయకులే కొట్టుకున్నారు. ఈ ప్రభుత్వ దిక్కుమాలిన పాలన కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మాకు అప్పు పుట్టటం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అంటున్నారు. మీ ముఖ్యమంత్రే దివాళా కోరు మాటలు మాట్లాడితే అప్పులు ఎలా పుడుతాయి. నిర్మాణం కాదు విధ్వంసం చేస్తామంటే ఇలాంటి పరిస్థితే ఉంటుంది. బీజేపీ నాయకుల కన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డి దేశ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఆశ్చర్యంగా అనిపించాయి. దేశ రక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది. ఏ మూసీ సుందరీకరణ అంటున్నావో, అదే ప్రాంతంలో 12 లక్షల చెట్లు నరికివేసి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఎలా న్యాయం చేస్తారు. గంగా నది పుట్టిన గంగోత్రి వద్ద 150 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్ అంట. మరి మూసీకి కనీసం 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ లేదా? మేమే కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లై ఓవర్లు కట్టాలని అనుకున్నాం. పర్యావరణం దెబ్బతింటుందంటే ఆ ప్రతిపాదనలను విరమించుకున్నాం. 2017 లో రాడార్ నిర్మాణం కోసం జీవో ఇచ్చినప్పటికీ పర్యావరణం దెబ్బ తింటుందంటే మేము ఆ జీవో ను తొక్కి పెట్టామని అన్నారు.
మేము జీవో ఇచ్చామని చెబుతున్నావ్. మేము చేసిన పనులన్నీ చేస్తున్నావా? రైతు బంధు, 24 గంటల కరెంట్, ఫించన్, పాలమూరు ఎత్తిపోతల మేము చేశాం. మరి నువ్వు వాటిని చేస్తున్నావా? మేము పర్యావరణ రక్షణ కోసం పనిచేశాం కాబట్టే ఇచ్చిన జీవోలను నిలిపివేశాం. రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీని ఒక్క మాట అనాలంటే దడ. అందుకే మనకు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగినప్పటికీ అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు.
జనవాసాలు లేని చోట పెట్టే రాడార్ కేంద్రాన్ని…తెలంగాణలో ఎందుకు పెట్టినట్లు? మూసీని పురిట్లోనే ఆగం చేసి కింద మాత్రం మంచి చేస్తామంటే ఎవరూ నమ్ముతారు. హైదరాబాద్ లో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మా నాయకులంతా కలసికట్టుగా కదులుతాం. ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తే మా ప్రజాప్రతినిధులను కలవండి. లేదంటే తెలంగాణ భవన్ కు రండి. మీకు న్యాయం తప్పకుండా జరగుతుంది. మా ఫార్మ్ హౌస్ లు చట్ట విరుద్దంగా ఉంటే వాటిని కొట్టేయండి. మా ఫార్మ్ హౌస్ లు కూలగొడితే నీకు రాక్షస ఆనందం వస్తదంటే కూలగొట్టు. కానీ పేద ప్రజల జోలికి వెళ్లకు. పేద ప్రజలను ఆగం చేస్తామంటే వారి ఇళ్లు కూలగొడతామంటే ఊరుకోం, మేము అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న బకాయి ఫీజు రీయింబర్స్ మెంట్ 2 వేల కోట్లను చెల్లించాం. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించాలి. రూ. 650 కోట్లు ఇస్తే సరిపోతుందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తే దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతుంది. గత ప్రభుత్వాలు బకాయిలు పెడితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కట్టాల్సిందే. అది నెక్ట్స్ మేము అధికారంలోకి వచ్చినా తప్పదని అన్నారు.
రేవంత్ రెడ్డి 10 నెలల్లో 80 వేల కోట్ల అప్పు చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదు. మరి అంత డబ్బు ఎక్కడికి పోయింది.
మన రాష్ట్రం రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్. మనం అన్ని కట్టిన తర్వాత కూడా మిగులు ఉందని భట్టి చెప్పారు. మరీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అప్పు చేశారో చెప్పాలి. హైడ్రా, మూసీ పేరుతో సృష్టిస్తున్న భయాకన వాతావారణం నుంచి ప్రజలను రక్షించేందుకు బీఆర్ఎస్ కదులుతోంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు.