ఆంధ్రప్రదేశ్ రాజకీయం

సీఎం చంద్ర‌బాబునాయుడు దృష్టికి  శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు..!

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు త‌నకు వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని వినియోగించుకుని సీఎం చంద్ర‌బాబునాయుడు దృష్టికి, ఇత‌ర శాఖ‌ల మంత్రుల దృష్టికి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌ను తీసుకెళ్తూ వాటికి ప‌రిష్కారం అందించే దిశ‌గా కృషి చేస్తూ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ధ్యాస‌గా, శ్వాస‌గా ముందుకు క‌దులుతున్నారు శ్రీ‌కాకుళం ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌.  చంద్ర‌బాబునాయుడు విజ‌య‌వాడ‌లోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో టీడీపీ ప్ర‌తినిధులతో స‌మావేశం అనంత‌రం ఎమ్మెల్యే గొండు శంక‌ర్ సీఎం చంద్ర‌బాబునాయుడును క‌లుసుకొని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై నివేదిక‌ల‌ను  అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో మాట్లాడుతూ బంద‌రువానిపేట‌, పీజీపేటలో ఫిష్ ల్యాండింగ్ జెట్టీ నిర్మాణం కోసం, నాగావ‌ళి న‌ది కొత్త వంతెన వ‌ద్ద కుడివైపు ర‌క్ష‌ణ‌గోడ నిర్మాణం కోసం, వంశ‌ధార న‌ది క‌ళింగ‌ప‌ట్నం వ‌ద్ద స‌ముద్రంలో క‌లిసే ద‌గ్గ‌ర గ్రోన్, దిశ మార్పు కోసం గోడ నిర్మాణం చేప‌ట్టాల‌ని, క‌ళింగ ప‌ట్నం బీజ్‌ను అభివృద్ధి కోసం, అదే విధంగా నాగావ‌ళి న‌ది పీజీపేట ద‌గ్గ‌ర స‌ముద్రం క‌లిసే ద‌గ్గ‌ర బీచ్ ఎంక్రోచ్‌మెంట్ అవ్వ‌కుండా గోడ నిర్మాణం కోసం ప్ర‌తిపాద‌న‌ల‌ను చంద్ర‌బాబునాయుడు దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు ఎమ్మెల్యే వివ‌రించారు.

వీటిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చ‌ర్చిస్తూ సానుకూలంగా స్పందించిన‌ట్టు ఎమ్మెల్యే తెలిపారు. నివేదిక‌ల‌ను సిద్ధం చేయాల‌ని త్వ‌ర‌లో అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి నిధులు మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని తెలిపారు. స‌మ‌స్య‌ను చెప్పిన వెంట‌నే స్పందించి ప‌రిష్కారం చూపేందుకు సిద్ధమైన గొప్ప విజ‌న్ క‌లిగిన నాయ‌కుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అని ఎమ్మెల్యే శంక‌ర్ చెప్పారు. కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, వ్య‌వసాయ‌శాఖ మంత్రి అచ్చెన్నాయుడుల స‌హ‌కారంతో త్వ‌ర‌లో ఈ ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని ఎమ్మెల్యే శంక‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.