జీహెచ్ ఎంసీగా మారాకే నగర విస్తీర్ణం పెరిగింది:మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ లోని ఫతేనగర్ లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. 100 ఎంఎల్ డీ (రోజుకు మిలియన్ లీటర్లు) సామర్థ్యంతో రూ.317 కోట్లు పెట్టి ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఆయన సభలో మాట్లాడారు. హైదరాబాద్ కు ఏటా లక్షల మంది బతికేందుకు వస్తున్నారని అన్నారు. . వారి అవసరాలు తీర్చేలా అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)గా ఉన్నప్పుడు నగర విస్తీర్ణం కేవలం 160 చదరపు కిలోమీటర్లే ఉందని, కానీ, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలనూ కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)గా మారిస్తే దాని పరిధి 625 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. పట్టణీకరణకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
నగరంలో రోజూ 1,950 ఎంఎల్ డీల మురుగు నీరు ఉత్పత్తి అవుతోందని, అందులో 772 ఎంఎల్ డీలను జలమండలి శుద్ధి చేస్తోందని పేర్కొన్నారు. సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని చెప్పిన ఆయన.. ఫతేనగర్ లో రూ.1,280 కోట్లతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, గతంలో మంచినీళ్లు, మురుగునీటి పైపులు కలిసిపోయాయని, దాంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ గుర్తు చేశారు.