ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై ఈడీ ఫుల్ ఫోకస్ పెట్టింది. రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కమీషన్లు తీసుకున్నారని 90కి పైగా ఫైళ్లలో మార్పులు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని కేసులను ఆధారంగా చేసుకుని ఆయన్ను విచారిస్తోంది ఈడీ. మొదటి రోజు 8 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు రెండో రోజు కూడా 7 గంటలపాటు అనేక ప్రశ్నలు వేశారు. మూడోరోజు కూడా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. దీంతో ఇవాళ కూడా ఈడీ ముందుకు రానున్నారు అమోయ్. రెండు రోజులపాటు ఆయన నుంచి కీలక సమాచారాన్ని ఈడీ రాబట్టినట్టు తెలుస్తోంది.రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో భూకేటాయింపులకు సంబంధించి భారీగా వెనకేసుకున్నట్టు అనుమానాలున్నాయి. ముఖ్యంగా మహేశ్వరం మండలం నాగారం గ్రామ పరిధిలోని 42 ఎకరాల భూదాన్ భూమి రికార్డ్స్ తారుమారుకు సంబంధించి కేసులు నమోదు కాగా, ఈడీ ఎంటర్ అయింది. దీనికి సంబంధించే ఆయన్ను రెండు రోజులుగా ప్రశ్నిస్తోంది ఈడీ. అమోయ్‌తోపాటు భూదాన్ భూములపై ఆరా తీసేందుకు పలువురు రియల్టర్లను కూడా విచారణకు పిలిచింది ఈడీ. భూముల రికార్డ్స్‌తో ఈడీ ఎదుట హాజరైన రియల్టర్స్ కీలక సమాచారం అందించినట్టు సమాచారం. అమోయ్ కుమార్, రియల్టర్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నలు వేసింది ఈడీ.
కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా బదిలీ చేశారన్న దానిపై ఈడీ ప్రశ్నలు వర్షం కురిపించింది. తాను అంతా నిబంధనల ప్రకారమే చేశానంటూ ఆయన బదులిచ్చారు. ప్రభుత్వ భూమికి తప్పుడు రికార్డులు సృష్టించి పట్టాపాసు పుస్తకాలు జారీ చేయడం గురించి గుచ్చి గుచ్చి అడిగారు ఈడీ అధికారులు. విజిలెన్స్ విచారణ రిపోర్ట్ ముందు పెట్టి ప్రశ్నిచారు. అయితే, కొన్నింటికి సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్‌లో సర్వేనెంబర్ 17లో 26 ఎకరాల సాగు భూమిని బలవంతంగా లాక్కున్నారని, కోట్లలో మీకు ముడుపులు అందాయని ఫిర్యాదులు వచ్చాయని ఈడీ తెలిపింది. అయితే, తాను ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని అమోయ్ కుమార్ చెబుతూ వస్తున్నారు.అమోయ్ కుమార్ బినామీ వ్యవహారాలకు సంబంధించి పత్రికలలో అనేక కథనాలు ఇచ్చింది.
అతని క్లాస్మెంట్‌కు చేరిన డబ్బుల వివరాలు వెల్లడించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు వెళ్లింది, ఎలా వెళ్లిందో అన్ని వివరాలను ప్రచురించింది. ఈ దిశగా ఈడీ ముందుకు వెళ్తే అమోయ్ గుట్టంతా బయటపడే ఛాన్స్ ఉంటుంది. అన్నీ రూల్స్ ప్రకారమే చేశానని చెబుతున్న అమోయ్, విచారణలో తప్పించుకునే ధోరణలోనే సమాధానాలు చెప్తున్నారు. స్వేచ్ఛ కథనాల ఆధారంగా ఈడీ ముందుకు సాగితే కీలక విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.