ఆంధ్రప్రదేశ్ రాజకీయం

దెందులూరులో టీడీపీ వర్సెస్ జనసేన

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో మిత్ర పక్షాల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తుంది. మద్యం దుకాణాల కేటాయింపు, ఇసుక సిండికేట్లు, నామినేటెడ్ పదవుల విషయంలో ఇలా ప్రతి విషయంలో ఒకరినొకరిపై విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధానంగా కూటమి పార్టీలు స్వీప్ చేసిన తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ ఆధిపత్య పోరు ఎక్కువగా కనపడుతుంది. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ కూటమి నేతల మధ్య విభేదాలు పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారాయి.. ప్రధానంగా పింఛన్ల పంపిణీ విషయంలో కూడా ఈరోజు అనేక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. తాము పింఛను పంపిణీ చేయాలని ఒకరంటే.. తాము కూడా భాగస్వామ్యులవుతామని జనసేన నేతలు కూడా రెడీ అవుతుండటంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయి.

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరెవ్వరంటూ టీడీపీ నేతలు జనసేన నేతలను ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసి, అభ్యర్థి విజయానికి ఇద్దరూ కృషి చేసినప్పటికీ, తర్వాత మాత్రం అనేక అంశాలు విభేదాలకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విభేదాలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చినట్లు తెలిసింది.పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు, చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. వీరు ఒకరినొకరు వీధుల్లోకి వచ్చి తిట్టుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. ఇది పెద్ద పంచాయతీగా మారింది. అయితే దెందులూరులో విభేదాలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పందించారు.కొన్ని అరాచక శక్తులు ఇటీవలే జనసేనలో చేరారని,పబ్బం గడుపుకోవడానికే వాళ్లు పార్టీలో చేరారని చింతమనేని అన్నారు.చేరినవాళ్లు చేరినట్టు ఉంటే మంచిదని,పెన్షన్ల పంపిణీతో వాళ్లకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు.

గ్రామాల్లో గొడవలు పెట్టే సంస్కృతి మానుకోవాలని కోరారు.ఆ రోజు కూటమి ఓటమికి ప్రయత్నించింది వీళ్లేనని, ఇప్పుడుపార్టీలో చేరి అధికారం చెలాయిస్తామంటే కుదరదని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. జనసేన అధినాయకత్వంతో తాను మాట్లాడతానని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
విజయనగరం నెల్లిమర్లలోనూ….
 వైసీపీ హయాంలో జనమంతా విసిగిపోయారు. ప్రభుత్వం మారాలనే ఉద్దేశంతో ఏపీలో కూటమి నేతలు ఒక్కటై పనిచేశారు. ఊహించిన దానికంటే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కలసి పనిచేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు.. రానురాను మితిమీరుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అయితే.. నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితి ఉందని.. సొంత పార్టీల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లోకం మాధవి వర్సెస్ టీడీపీ ఇన్‌ఛార్జ్ బంగార్రాజుగా మారిందట. ఇప్పటివరకూ లోలోపలే తన్నులాడుకున్న వారు.. ప్రస్తుతం రోడ్డెక్కారనే టాక్ బలంగా వినిపిస్తోంది.విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కూటమిలో కుమ్ములాటలు బహిర్గతం అవుతున్నాయట. మొన్నటి వరకూ లోలోపలే కత్తులు దూసుకున్న నాయకులు నేడు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయట.

నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ అనికూడా చూడకుండా బంగార్రాజును లోకం మాధవి అవమానించారట. ASIని పిలిచి… ఇతనిని బయటకి పంపించాలంటూ హకుం జారీ చేయటంతో నగర పంచాయతీ సమావేశంలో ఆయన కంగుతున్నారట. తర్వాత కుదుటపడి. బంగార్రాజు కూడా ఎమ్మెల్యేకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారట. తాను ఆహ్వానం మేరకే సమావేశానికి వచ్చానని.. దానిపై తనకు క్లారిటీ ఉందని బదులు ఇవ్వటంతో సమావేశం కాస్తా హీట్‌గా మారిందట.నియోజకవర్గంలో ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదట. ఇటీవల చింతలవలస రోడ్డు శంకుస్థాపన అంశంలోనూ ఇలాంటి సీన్ జరిగిందట. శంకుస్థాపన కార్యక్రమానికి తమకెందుకు ఆహ్వానం ఇవ్వలేదని తెలుగు తమ్ముళ్లు.. జనసేన ఎంపీపీని అడ్డుకున్నారు. కూటమిలో అందరం కలసి పనిచేస్తేనే గెలుపు సాధ్యమైందని అలాంటపుడు తమను ఎలా పక్కన పెడతారనేది టీడీపీ వాదనగా తెలుస్తోంది.

మమ్మల్ని పిలవకుండానే.. మీరే అభివృద్ది కార్యక్రమాలు చేపడతారా అని ప్రశ్నించటంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొందట. దీంతో సదరు ఎంపీపీ వెనక్కి వెళ్లిపోయారు. ఈ పంచాయితీ అక్కడితో ఆగలేదు. ఇదే విషయాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కూడా చేసేదేం లేక.. విభేదాలు లేకుండా పని చేయాలని సూచనలు మాత్రమే చేశారట.మరోవైపు.. తెలుగుదేశం కూడా జనసేకు షాకులిస్తూనే ఉందట. మార్క్ ఫెడ్ ఛైర్మన్ అయ్యాక ఏర్పాటు చేసిన సభకి ఎమ్మెల్యే లోకం మాధవికి ఆహ్వానం లేదట. కేవలం టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే ఆహ్వానించారు . ఇలా ఎప్పటికప్పుడే కూటమిలో కుమ్ములాటలు బహిర్గతం అవుతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. కర్రోతు బంగార్రాజును కూడా ఎక్కడా తగ్గవద్దని.. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ భరత్.. హింట్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కనీసం ఓటు బ్యాంక్ లేని వాళ్లని ఎమ్మెల్యేగా చేస్తే… రివర్స్ అవ్వటం ఏంటని టీడీపీ సీనియర్లు సైతం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించిన మాధవి.. కేడర్‌ను పెంచుకునే పనిలో పడ్డారట. వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది . తనకి నియోజకవర్గంలో తగిన బలం ఉండాలనే తపనలో ఆమె ఉన్నారని తెలుస్తోంది. నెల్లిమర్లలో టీడీపీని తట్టుకొని నిలబడాలంటే.. సీనియర్ నాయకుల అవసరం ఉందని గ్రహించిన మాధవి.. వైసీపీ సీనియర్లకు గాలమేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేనాని అండదండలు కూడా మాధవికి.. బలంగానే ఉన్నాయనే టాక్ ఉంది. జనసేన పార్టీకి మాధవి ఫండింగ్ చేస్తుండడం వల్లే ఆమెకు అంత ప్రాధాన్యత అనే విమర్శించిన వాళ్లూ నియోజకవర్గంలో ఉన్నారట.బంగార్రాజు- మాధవి వ్యవహార శైలితో.. లోకల్ లీడర్లు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట.

ప్రభుత్వంలో కంటే ప్రతిపక్షమే బెటర్ అనే ఫీలింగ్‌తో కొందరు ఉన్నారంటే.. నెల్లిమర్లలో పరిస్థితి ఏంటనేది తెలుస్తోంది. టీడీపీ నాయకులకు ఎలాంటి పనులు చేయవద్దని మాధవి ఇప్పటికే అధికారులకు హుకుం జారీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. తాను చెప్పిన నాయకులు వస్తేనే పనులు చేయాలంటూ ఎమ్మెల్యే చెప్పటంతో వివాదం కాస్తా ఎక్కువ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గొడవలు ముదరకముందే.. రెండు పార్టీల అధినేతలూ పిలిపించి మాట్లాడితే తప్ప పరిస్థితిలో మార్పు రాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.