రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం చంద్రబాబు. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే.. మరోవైపు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా కొన్ని కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి.. అభివృద్ధి బాటలు వేయాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వైవిధ్యంగా కూడా ఉంటాయి. ఏదైనా ముందుచూపుతో వ్యవహరిస్తారన్న మంచి పేరు ఆయనకు ఉంది. సైబరాబాద్ ఆలోచన ఆయనదే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. ఈ విషయంలో మాత్రం మెజారిటీ ప్రజలు చంద్రబాబుకు జై కొడతారు. అయితే అనూహ్య పరిస్థితుల్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. గత అనుభవాల దృష్ట్యా అభివృద్ధితోపాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు,రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకోవడం పై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మార్చే ప్రణాళికలను రూపొందించారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,డ్రోన్ తయారీ,సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలన్నది చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది. భవిష్యత్తులో అన్ని రకాల సేవలు, లావాదేవీలు డ్రోన్ టెక్నాలజీ ద్వారా జరగనున్నాయి. మొన్న విజయవాడ వరదల్లో సైతం డ్రోన్లతోనే బాధితులకు ఆహారం అందించారు. అదే డ్రోన్లతోనే సాగులో అనేక రకాలైన సేవలు చేపడుతున్నారు. దాదాపు అన్ని రంగాల్లో డ్రోన్ల ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది. అందుకే ఆ రంగంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.మొన్న ఆ మధ్యన విజయవాడలో అంతర్జాతీయ డ్రోన్ల ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. సరికొత్త ఆవిష్కరణలు చేశారు. అయితే దీని వెనుక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉంది. అమరావతిని డ్రోన్ల హబ్ గా మార్చాలి అన్నది చంద్రబాబు ప్లాన్. దేశం యావత్తు అమరావతి వైపు చూసేలా.. భారీ డ్రోన్ల రూపకల్పనకు అమరావతిని చిరునామా చేయాలన్నది లక్ష్యం. అందుకే ఇక్కడ డ్రోన్ల ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి.. అమరావతి చర్చకు వచ్చేలా చేశారు.
మరోవైపు డ్రోన్ ఉత్పత్తి కంపెనీలకు అనంతపురంలో డెస్టినేషన్ గా మార్చాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే శ్రీ సిటీలో పరిశ్రమలు భారీగా ఏర్పాటయ్యాయి. దానిని సెమీ కండక్టర్ హబ్ గా మార్చేందుకు చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.మరోవైపు సాగరనగరం విశాఖలో ఐటీ అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే నారా లోకేష్ అమెరికా వెళ్లారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు.విశాఖలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అన్ని రకాల వసతులు ఉన్నాయి. అందుకు అక్కడ మరింత అభివృద్ధి చేసి.. ఐటీ రంగంలో విశాఖను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తానికి అయితే మంచి ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు బాబు. మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు జరిపారు. టెక్నాలజీ రంగంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలిపారు. అవి మంచి ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.