ఫ్యాప్టో కడప జిల్లా చైర్మన్ మాదన విజయ కుమార్
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సిపిఎస్) విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్) విధానాన్ని అమలు చేసేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం వంచనకు పరాకాష్ట అని ఫ్యాప్టో కడప జిల్లా చైర్మన్ మాదన విజయ కుమార్ ఆరోపించారు.
ఉద్యోగ,ఉపాధ్యాయులకు జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ చట్టం చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నకేశంపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరామంలో నిరసన తెలియజేశారు.
సందర్భంగా మాదన విజయకుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను, విశ్వసనీయత కోల్పోతే పదవిలో కొనసాగను అనే ముఖ్యమంత్రి మాటలను ఉద్యోగ, ఉపాధ్యాయులు నమ్మి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సహకరిస్తే , సిపిఎస్ స్థానంలో ఓపిఎస్ విధానాన్ని అమలు చేయకుండా జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ ఉద్యోగులను నిట్ట నిలువునా దగా చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా మాట తప్పి, మడమ తిప్పడమేనా ! మీ విశ్వసనీయతా అని నిలదీశారు.
ఎన్నికలలో హామీ ఇవ్వని అనేక రాష్ట్రాలు ఇప్పుడు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే దిశగా సాగుతుంటే, హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జిపిఎస్ విధానం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ పెద్దలు చెప్పడం దుర్మార్గమన్నారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో అమలు చేస్తున్న జిపిఎస్ దేశానికి ఎలా ఆదర్శమవుతున్నదో సమాధానం చెప్పాలన్నారు. తమకు పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఘోషిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం తగదన్నారు. పాత పెన్షన్ విధానానికి జిపిఎస్ ప్రత్యామ్నాయం కానే కాదన్నారు. ఓపిఎస్ సాధించేవరకు తమ పోరాటం సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించిన ఈ ప్రభుత్వానికి తగు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆక్రందనలను అర్థం చేసుకొని జిపిఎస్ విధానాన్ని అమలు చేసే ఆలోచనను ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సాధనకై ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో తమ వైఖరిని మార్చుకోకపోతే రాబోయే ఎన్నికలలో తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.సుబ్రహ్మణ్యం, టి.పెంచలయ్య, ఆర్.వెంకటసుబ్బయ్య, టి.వి.సుబ్బారావు, పి.సుబ్బరాయుడు, ఎస్.వరలక్ష్మి, ఎస్.గౌస్ బాషా, వై.రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.