ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సర్పంచ్‌లకు గుడ్ న్యూస్ చెప్పారు. 15 ఫైనాన్స్ డబ్బులు త్వరలోనే అకౌంట్లలో జమవుతాయని స్పష్టం చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సర్పంచులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం హాజరయ్యారు. ఈ భేటీలో మొత్తం 16 అంశాలను సర్పంచ్‌లు పవన్ ముందుంచారు. కనీసం సిబ్బంది జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేయగా.. త్వరలోనే గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. అలాగే, రాజధానిలో భవన నిర్మాణం కోసం 2 ఎకరాల స్థలం అడగ్గా.. సానుకూలంగా స్పందించారు. ‘సర్పంచ్‌ల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తి చేశాం. కేరళ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చాం. ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. నా పేషీలో ప్రజలకు మేలు చేద్దామన్న అధికారులు ఉండడం నా అదృష్టం. గ్రామీణ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం కట్టుబడి ఉంది.’ అని పవన్ పేర్కొన్నారు.గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని పవన్ మండిపడ్డారు.
పార్టీలపరంగా విభేదాలు ఉండొచ్చు కానీ.. అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని అన్నారు. ‘జీతాలు పెంచాలని జీవోలో ఎక్కడా లేదు. వైసీపీ గ్రామ వాలంటీర్లను దారుణంగా మోసం చేసింది. వారికి ఇచ్చిన మాటను నెరవేరుద్దామని చూస్తుంటే ఎక్కడా జీవోలో వాళ్లు లేరు. అవి ఉద్యోగాలే కావు. ఇదొక సాంకేతిక సమస్యగా మారింది. ఓ వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం సహా అన్ని వ్యవస్థలను బలోపేతం చేయాలి. కీలక పంచాయతీరాజ్ శాఖని మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంపీ నిధుల ద్వారా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.750 కోట్లు 30 వేల పనులకు ఇంకో నెల రోజుల్లో విడుదలవుతాయి. గత ప్రభుత్వం నిధులు మన ప్రభుత్వం ఎక్కడా ఆపట్లేదు. గత ప్రభుత్వం 12,900 గ్రామ పంచాయతీల్లోని రూ.8,629 కోట్ల నిధులు వాడేసుకున్నారు. తిరిగి వాటిని జమ చేయాలని కోరుతున్నారు. ఈ అంశాలను సీఎం, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తాను. ఈ విషయాన్ని కేబినెట్‌లో చర్చిస్తాను. పెండింగ్ నిధుల విడుదలకు కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలుపుతాం.’ అని పేర్కొన్నారు.
‘ప్రధాని మోదీ కూడా గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. సరిచేయడానికి చంద్రబాబు అనుభవం కీలకంగా మారింది. పంచాయతీలను బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ గ్రామానికి తాగునీరు అందిస్తాం. చెరువుల్లో పూడికలు తీసి, నీరు కలుషితం కాకుండా చూడాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటాం.’ అని పవన్ తెలిపారు.