తెలంగాణ రాజకీయం

మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ..

హైదరాబాద్ నగరంలో హైడ్రా మళ్లీ యాక్షన్ మొదలు పెట్టింది. గ్రేటర్‌లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన 50 మందికి శుక్రవారం నోటిసులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో పార్కులు, ఫుట్ ‌పాత్‌లు, నాలాలు, రోడ్లను ఆక్రమించిన వారిపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారు… నోటిసులు అందుకున్న 15 రోజుల్లో తొలగించకపోతే కూల్చివేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గ్రేటర్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత…
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం   ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అధికారులు హైడ్రా డైరెక్షన్‌లోనే నోటీసులు   జారీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో (GO) 199 విడుదల చేసింది. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాలను హైడ్రాకు ఇచ్చింది. జీహెచ్ఎంసీ   చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు. అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా అమలు చేయనుంది.
హైడ్రా నోటీసులు
తాజా అధికారాలతో ఆక్రమణలకు సంబంధించి హైడ్రా నోటీసులు జారీ చేయనుంది. ఆయా నిర్మాణదారులు సంబంధిత అనుమతి పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించని పక్షంలో ఆర్డర్స్‌ జారీ చేస్తుంది. వారు ఇచ్చే వివరణ అప్పటికీ సహేతుకంగా లేకుంటే నిర్మాణం కూల్చివేత/సీజ్‌ చేసే అధికారం హైడ్రాకు ఉంటుంది. చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలపై ఆదిలో ఉక్కుపాదం మోపిన హైడ్రా… తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కొంత కాలంగా ఆచితూచి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడంతోపాటు చెరువుల వాస్తవ విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిర్ధారణపై దృష్టి సారించింది. ఇందుకోసం సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఆర్‌ఎస్‌సీ సాంకేతిక సహకారం తీసుకుంటోంది.
చట్టపరంగా ముందుకు..
జీవో జారీ నేపథ్యంలో ఇక నుంచి చట్టపరంగా ముందుకు వెళ్లాలని సంస్థ భావిస్తోంది. వాస్తవానికి రోడ్లు, పార్కులు, చెరువుల్లో ఆక్రమణలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాలు జీహెచ్‌ఎంసీతోపాటు మునిసిపాలిటీలకు ఉన్నాయి. కానీ, కూల్చివేతలపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో నోటీసుల జారీ, స్పీకింగ్‌ ఆర్డర్స్‌ తర్వాతే హైడ్రా నిర్ణయం తీసుకోనుంది. ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు హైడ్రా పరిధి ఉన్న నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వరకు జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ ప్రకారం, వివిధ ప్రాంతాల్లోని 27 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో మునిసిపల్‌ చట్టం ప్రకారం ముందుకు సాగనున్నట్టు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. తాజా జీవోతో హైడ్రా మరింత బలపడిందని, పూర్తి స్థాయిలో అధికారాలు వచ్చాయన్నారు. అనధికార భవనాలను కూల్చివేయడంతోపాటు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారికీ హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని తెలిపారు.