మహారాష్ట్ర సంస్కృతి, మరాఠి భాషను రక్షించుకోవాలంటే మహాయుతి కూటమిని గెలిపించుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా.. డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత.. జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందని, అద్భుత అయోధ్య నిర్మాణం సాధ్యమైందని, నలువైపుల నూతన రోడ్లు నిర్మాణ మవుతున్నాయంటూ ప్రశంసించారు. మరోవైపు.. బీజేపీ హాయలోనే దేశంలోని రైతులు, పారిశ్రామిక వేత్తలకు అందుతున్న ప్రయోజనాల్ని ప్రస్తావించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మహాయుతి కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. సభకు హాజరైన శ్రేణుల్లో ఉత్సాహం నింపిన పవన్.. చాలా వరకు హిందీ, మరాఠాలో ప్రసంగించారు. అక్కడి ప్రజలకు రాష్ట్రంలో మహాయుతి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. సనాతన ధర్మ కోసం బలంగా పోరాడాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ కారణంగానే ఇక్కడి దేవాలయాలు భద్రంగా ఉన్నాయన్నారు.
అక్రమార్కుల్ని సరిహద్దుల్లోనే తరిమికొట్టిన ఘటన శివాజీకే సొంతమవుతుందంటూ నమస్కరించారు. మహాయుతి కూటమికి వ్యతిరేకంగా అఘాడీ కూటమిలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే కి చురకల అంటించారు. శివసేనా వ్యవస్థాపకులు బాలాసాహెబ్ ఠాక్రే.. దేశాన్ని రక్షించేందుకు, బలమైన దేశ నిర్మాణానికి కృషి చేశారని పొగడ్తలు కురిపించారు. మనమంతా విడిపోయి బలహీన పడిపోదామా.? కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని ప్రశ్నించారు. ఇక్కడ ఏ ప్రాంతాల వారున్నా.. వారందరిలో సనాతన ధర్మమే నినదిస్తుందని అన్నారు.మహారాష్ట్ర లక్షకోట్ల ఆర్థిక వ్యవస్థ కోసం మహాయుతి కూటమి ప్రయత్నిస్తోందన్న పవన్ కళ్యాణ్.. అందుకు మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడేటప్పుడు.. ప్రజలంతా సినిమాల కోసం నినాదాలు చేయగా.. సున్నితంగా ఆ విషయాన్ని ఎన్నికల వైపు మరల్చారు. సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవలు పడడం చాలా సులువని.. కానీ నిజ జీవితంలో ధర్మం కోసం గొడవపడడం చాలా కష్టమన్నారు. ఏ హిందువు గుండెల్లో రామ నామం లేకుండా ఎలా ఉంటుందన్నారు.
అందుకే.. ప్రతీ ఒక్కరిలో రామనామాన్ని జపిస్తూ, ధర్మం వైపు నిలబడాలని అభ్యర్థించారు.సామాన్యుడు అనుకుంటే.. అందరూ సామాన్యులే అని కానీ.. బలమైన సంకల్పం ఉంటే అందరూ అసమాన్యులే అని అన్నారు. మన దేశం కోసం, మన ధర్మం కోసం నిలబడాలంటూ కార్యకర్తక దిశానిర్దేశం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మరాఠి సంస్కృతి కోసం, మరాఠి భాష కోసం ప్రజలంతా మహాయుతి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని పిలుపునిచ్చారు.ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొని.. 15 నిముషాలు పోలీసు పక్కకు తప్పుకుంటే హిందువుల అంతు చూస్తామంటూ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. ఎవడో.. హైదరాబాద్ నుంచి వచ్చి 15 నిముషాలు చాలు అనే వాళ్లకు బలమైన సమాధానం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఇది ఛత్రపతి శివాజీ నేల అని.. అలాంటి బెదిరింపులకు భయపడమంటూ హెచ్చరించారు.మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా అంటూ ప్రశ్నించారు.
ఓసారి మత ప్రాతిపాదికన ఈ దేశం విడిపోయిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. మేం చేతకాని వాళ్లం కాదు అని హెచ్చరించారు. సాధ్యమైనంత శాంతంగా ఉంటాం, బరిస్తాం, కానీ.. హద్దులు దాటితే మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం అంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు భయపడతారా అంటూ కార్యకర్తల్ని అడిగారు.