ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని నెలల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. కేవలం ఇంటికే పరిమితమయ్యారు. కల్వకుంట్ల కవిత దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఊపు ఊపారు. తొలిసారి ఎంపీగా గెలిచిన కవిత, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా బీఆర్ఎస్ అధినేత ఆమెకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దీంతో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారని అందరూ అంచనా వేశారు. కల్వకుంట్ల కుటుంబంలో కవితకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమం నుంచి కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. జాగృతి సంస్థ ను ఏర్పాటు చేసి కవిత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కల్వకుంట్ల కవిత ఒక దశలో తెలంగాణ మంత్రి వర్గంలో చేరతారని వార్తలు వచ్చినా అది సాధ్యపడలేదు.
మూడో సారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆమె మంత్రి పదవిని చేపడతారని అందరూ అంచనా వేశారు. కానీ మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు కూడా కల్వకుంట్ల కవిత దూరంగా ఉున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి కొన్ని నెలల పాటు జైలులో ఉండి వచ్చిన తర్వాత కవిత పూర్తిగా మారిపోయారు.కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తీహార్ జైలులో ఆమె కొన్ని నెలల పాటు ఉన్నారు. చివరకు ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆమెకు బెయిల్ లభించింది. బెయిల్ లభించినప్పుడు కూడా బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత తన మద్దతుదారులతో తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన బీజేపీ పై పోరాటం చేస్తానని జైలు బయట ప్రకటించారు. అయితే జైలు నుంచి బెయిల్ పై వచ్చిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు. తన తండ్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి పది రోజుల పాటు రెస్ట్ తీసుకున్నారు.
అయితే జైలులో ఉన్నందున కల్వకుంట్ల కవిత ఆరోగ్యం కొంత క్షీణించిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రిలో పరీక్షలు కూడా చేయించుకున్నారు. ఇక తర్వాత బతుకమ్మ పండగ కు కూడా కల్వకుంట్ల కవిత దూరంగా ఉన్నారు. అసలు కవిత రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా? అన్న అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సోదరుడు, తండ్రి రాజకీయాల్లో ఉండగా తాను ఎందుకు బయటకు రావడం అన్న ధోరణిలో ఆమె ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే కల్వకుంట్ల కవిత రాజకీయాలకు దూరంగా ఉన్నారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరిగి ఎన్నికల నాటికి ఆమె రాజకీయంగా యాక్టివ్ అవుతారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే కవిత ఇంటికే పరిమితమయ్యారని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద కవిత వాయిస్ మాత్రం తెలంగాణలో వినిపించడం లేదు. రాజకీయంగా ఆమె పెద్ద నిర్ణయమే తీసుకునే అవకాశాలున్నాయి.