ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా పొత్తుల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సంబంధించిన నిర్ణయం ఇప్పుటికిప్పుడే తీసుకునేది కాదని తెలిపారు. సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా లేక కలిసి వెళ్లాలా అనేది అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. పొత్తులపై తమ నాయకులు ఎవరికి వారు వ్యక్తిగత అభిప్రాయాలు ప్రస్తావించొద్దని సూచించారు. అలాగే టీవీ డిబేట్‌లలో గాని మరెక్కడా కూడా పొత్తులకి సంబంధించిన అంశాలను ఎవరూ మాట్లాడవద్దని అన్నారు. ఒకవేళ ఎవరైన వీటికి సంబంధించిన అంశాలను మాట్లాడితే పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని తెలిపారు.
జన సముహాన్ని చూసి మితిమీరిని ఆత్మవిశ్వాసానికి పోవద్దని సూచించారు. అధికారం కావాలని ఎవరికి ఉండదని.. బలంగా పనిచేస్తే అధికారం అదే వస్తుందని పేర్కొన్నారు.ఎక్కడ సభ పెట్టిన చాలా మంది జనాలు వస్తున్నారని.. ఆ సముహాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం అని తెలిపారు. ఇదిలా ఉండగా జనసేన రెండో దశ వారాహి యాత్ర ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలురు నుంచే ఈ యాత్రను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏలూరులో భారీ బహిరంగ సభను సైతం నిర్వహించనున్నారు.