తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పబ్లిక్,ప్రైవేటు పార్టనర్ షిప్ గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ ఈ మోడల్ కొన్ని విభాగాల్లో అమలు చేస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు ఏపీలో అభివృద్ధి పనులకు ఈ మోడల్ అనుసరించాలనుకుంటున్నారు. అంటే రోడ్లను ప్రైవేటు కంపెనీలతో వేయిస్తారు. ప్రజల నుంచి టోల్ వసూలు చేస్తారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారుల్లో ఈ విధానం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రహదారులకూ తీసుకు వస్తారు. అలాగే గోదావరి నీటిని బనకచర్ల వరకూ తీసుకెళ్లేందుకూ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ఇందుకు రూ. 70వేల కోట్లు ఖర్చవుతాయి. అంటే ఆ డబ్బులూ ప్రజలు కట్టాల్సిందే. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోడ్ల నిర్వహణను అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. వారు టోల్ ఫీజు వసూలు చేసుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రోడ్లపైన పైలట్ ప్రాజెక్టుగా టోల్‌గేట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పారు.
మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర,జాతీయ రహదారులకు వెళ్లే మార్గాల్లో టోల్‌గేట్లు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు సిఎం తెలిపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తానే పిపిపి పద్ధతిలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రతిపాదన చేశానని అప్పట్లో తనను అందరూ వ్యతిరేకించారని, కానీఇప్పుడు దేశ వ్యాప్తంగా నాలుగు, ఆరు, ఎనిమిది, 14 లైన్ల జాతీయ రహదారులు కూడా వచ్చాయన గుర్తు చేసుకున్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర రహదారులపైనా ప్రయాణించాలన్న టోల్ గేట్లు తప్పవన్నమాట. గోదావరి నీటిని పెన్నాకు తరలించడానికి నదుల అనుసంధాన ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. కృష్ణా నదికి తరలించిన గోదావరి మిగులు జలాలను ప్రకాశం బ్యారేజీ సమీపంలోని వైకుంఠపురం కు తరలిస్తారు. అక్కడ ప్రకాశం బ్యారేజీ తరహాలో బ్యారేజీ నిర్మిస్తారు. అక్కడి నుంచి బొల్లాపల్లికి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. బొల్లాపల్లి రిజర్వాయరు నుంచి నల్లమల మీదుగా బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను తరలించేలా జల వనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల 22 టీఎంసీలను వెలిగొండ ప్రాజెక్టుకు సరఫరా చేయవచ్చని చెబుతున్నారు. ఇక బనకచర్ల కాంప్లెక్స్ నుంచి తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు 140 టీఎంసీలను తరలించవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు 180 టీఎంసీల గోదావరి జలాలను తరలించే వీలుంది. ఈ ప్రాజెక్టు చేపట్టాలంటే రూ.70 వేల కోట్లు కావాలి. అంత మొత్తం ప్రభుత్వం వద్ద ఉండదు. అందుకే చంద్రబాబు PPP మోడల్ గురించి ఆలోచిస్తున్నారు.రోడ్లు, ప్రాజెక్టులు ప్రైవేటు, ప్రభుత్వ పార్టనర్ షిప్‌లో ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఆయా కంపెనీలు ఆదాయం సంపాదించుకునే మార్గాలు చూపిస్తారు. టోల్ వసూలు చేస్తారా నీటి తీరువా వసూలు చేస్తారా మరొకటా అన్నది తర్వాత. రైతుల పంటలకు కావాల్సినంత నీరు సదుపాయం వస్తే.. అంత కంటే కావాల్సిందేమీ ఉండదని అంచనా వేస్తున్నారు.
PPP విధానంతో ఏపీని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు నుంచీ చెబుతున్నారు . ప్రజల ఆదాయాలను పెంచితే వారు ఈ విధానం ద్వారా మేలు జరిగితే ఎంతో కొంత పన్నులు కట్టేందుకు సిద్ధంగా ఉంటారు. మేలు జరగకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.