తెలంగాణ ముఖ్యాంశాలు

200 ఎకరాల ఆసామిపై 2 గుంటల పేదోడు

  • ఈటలపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌
  • యువకుడు, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు
  • పేదింటి బీసీ బిడ్డకు టికెట్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • రాష్ట్రం కోసం జైలు శిక్షలు అనుభవించిన విద్యార్థి నేత
  • మంత్రిగా ఏమీ చేయని ఈటల ఎమ్మెల్యేగా ఏం చేస్తడు?
  • రాజకీయ ఓనమాలు నేర్పిన కేసీఆర్‌పై దుర్భాషలా?
  • లెఫ్టిస్టునని చెప్పుకొని రైటిస్టుగా మారటం ఆత్మవంచనే
  • ప్రజా ఆశీర్వాద సభలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ఫైర్‌
  • హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట దాకా భారీ బైక్‌ ర్యాలీ

తన రక్తంలో లెఫ్టిజం ఉన్నదని చెప్పుకొనే రాజేందర్‌ రైటిజం పార్టీలో చేరి ఆత్మ వంచన చేసుకున్నాడు. మంత్రిగా ఉన్నపుడే చేయలేని పనులు రేపు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేయగలడు? పెంచి పెద్ద చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండెల మీద తన్నితే ఎంతో బాధ ఉంటది. ఇప్పుడు కేసీఆర్‌ పట్ల కూడా ఈటల ఇలానే వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి.ఈటలకు 200 ఎకరాల భూమి ఉన్నది. ఆ పైసలతోనే ఇక్కడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు, కుక్కర్లు పంచుతున్నాడు. గెల్లు శ్రీనివాస్‌కు రెండు గుంటల భూమే ఉన్నది. కేసీఆర్‌ అడుగుజాడల్లో పోరాడి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. కష్టపడి సేవచేస్తాడు. ఆయనతో పనులు చేయించే జిమ్మెదారి మాది.
ఆయనను ఆశీర్వదించండి.

మంత్రి హరీశ్‌రావు

  • విద్యాdర్థి ఉద్యమకారుడే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
  • ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ ఉద్యమ కాలంలో అరెస్ట్‌ అయి పలుమార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్‌ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో రెండు గుంటల నిరుపేదకు, రెండు వందల ఎకరాల ఆసామికి మధ్య పోటీ జరుగబోతున్నదని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో బుధవారం జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ఓనమాలు నేర్పి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రెండుసార్లు మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌ గురించి నీచంగా మాట్లాడుతూ ‘రా’ అనే స్థితికి ఈటల దిగజారాడని మండిపడ్డారు. ‘ఎకరం అమ్ముతా ఎలక్షన్‌ గెలుస్తా’ అని గతంలో రాజేందర్‌ అన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఆయనకు రెండు వందల ఎకరాల భూమి ఉన్నదని, ఆ పైసలతోనే ఇక్కడ గడియారాలు, కుట్టుమిషన్లు, గ్రైండర్లు, కుక్కర్లు పంచుతున్నాడని, గెల్లు శ్రీనివాస్‌కు 2 గుంటల భూమి మాత్రమే ఉన్నదన్నారు. గెల్లు శ్రీనివాస్‌ తమతోపాటు ఉద్యమంలో పనిచేశాడని, 20 రోజులు చర్లపల్లి జైలులో, ఏడు రోజులు చంచల్‌గూడ జైల్లో శిక్ష అనుభవించాడని గుర్తుచేశారు. ఆయనకు కేసీఆర్‌తోపాటు తమందరి ఆశీర్వాదం ఉన్నదని చెప్పారు. ‘సీఎం కేసీఆర్‌ ఎంపిక చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పేదింటి బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించండి. ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నా బిల్లులు ఇప్పిస్తాం’ అని అన్నారు. రూ.10 కోట్లతో రామచంద్ర ఆలయాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. మహిళాసంఘాలకు ప్రతి గ్రామంలో రూ.25 లక్షల చొప్పున మంజూరుచేస్తామని, మహిళా భవనాలు నిర్మించుకుందామని అన్నారు.

ఎమ్మెల్యేగా ఈటల ఏం చేయగలడు?

‘ఈటల తనను చూసి ఓటెయ్యమంటున్నాడు, మాట్లాడితే ఆత్మగౌరవం అంటున్నాడు. ఒక నాయకుడు కోరుకొనే ఆత్మగౌరవం ప్రజల ఆత్మగౌరవం కాదు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెంచి పెద్ద చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండెల మీద తన్నితే ఎంతో బాధ ఉంటదని, ఇప్పుడు కేసీఆర్‌ పట్ల కూడా రాజేందర్‌ ఇదే విధంగా వ్యవహరించారని, అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాదని పోటీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యనేనని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఏం చేయగలమో వందల విషయాలు చెప్పగలమని, బీజేపీ ఏం చేయగలదో ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. రాజేందర్‌ గతంలో ఆరుసార్లు గెలిచినపుడు ఒక్కసారైనా గడియారాలు ఎందుకు పంచలేదని ప్రశ్నించారు. రూ.60 పెట్టి తెచ్చిన గోడ గడియారాలు ఇచ్చి తమ ఆత్మగౌరవం దెబ్బతీశాడని ప్రజలు వాటిని పగులగొడుతున్నారని తెలిపారు. ఆసరా పెన్షన్లు పరిగె ఏరుకున్నట్లు ఉన్నదని, కల్యాణలక్ష్మితో కష్టాలు తీరవని, చివరికి రైతుబంధు కూడా వద్దని చెప్పిన ఈటల తాను మాత్రం రూ.10.50 లక్షలు తీసుకున్నాడని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. బీజేపీలో చేరిన రాజేందర్‌ కొత్త భాష నేర్చుకున్నాడని సీఎం కేసీఆర్‌ను ‘రా’ అంటూ.. తనను ‘ఒరేయ్‌ హరీశ్‌ దమ్ముంటే రారా’ అంటూ అనుచితంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

ధరలు పెంచే పనులు చేస్తున్న బీజేపీ

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజీల్‌ ధరలు రూ.106కు పెంచిందని, గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1000 చేసిందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారని, ఎల్‌ఐసీని కూడా అమ్మే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. రైతుబంధు పథకం కింద రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సొమ్మును కేంద్రం డీజిల్‌ ధరల కింద గుంజుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తున్న టీఆర్‌ఎస్‌ వైపు ఉంటారో.. ధరలు పెంచేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీ వైపు ఉంటారో ప్రజలు నిర్ణయించుకోవాలని హరీశ్‌ విజ్ఞప్తి శారు.

రెండు పట్టణాలు గులాబీమయం

హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాలు బుధవారం పూర్తిగా గులాబీమయమయ్యాయి. హుజూరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, జమ్మికుంటలో మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌తోపాటు వేలాదిగా తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ శ్రేణులతో హుజూరాబాద్‌ క్యాంపు కార్యాలయం నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభమైంది. అక్కడి నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు వచ్చి, అక్కడి నుంచి జమ్మికుంట వైపు బైక్‌ ర్యాలీ సాగింది. జమ్మికుంటలో వేలాది మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మంత్రి హరీశ్‌రావుకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇల్లందకుంట శ్రీరామాలయంలో అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ప్రత్యేక పూజలుచేశారు.

నాలుగు వేల ఇండ్లు మంజూరు చేసినా ఒక్కటి కట్టలేదు

సీఎం కేసీఆర్‌ ఆరేండ్ల కింద హుజూరాబాద్‌కు 4 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని, అందులో ఇప్పటివరకు ఒక్కటి కూడా కట్టలేదని ఈటలపై మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పనులను రేపు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేయగలడా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగా ఒక రాజేందర్‌కు లాభం జరగాలా? 2.29 లక్షల మందికి లాభం జరగాలా? ఆలోచించుకోవాలని అన్నారు. ఇన్నాళ్లూ రాజేందర్‌ ఏవైనా పనులు చేశారంటే అది కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే అనే విషయాన్ని మర్చి పోవద్దని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే చేయగలిగారని వివరించారు. హుజూరాబాద్‌లో ఆయన కట్టించకుండా వదిలిపెట్టిన ఇండ్లను రేపు కట్టిస్తామని చెప్పారు.