ఆంధ్రప్రదేశ్ జాతీయం ముఖ్యాంశాలు

PV Sindhu: శ్రీవారిని దర్శించుకున్న ఒలింపిక్‌ విన్నర్‌

టోక్యో ఒలింపిక్స్‌ విన్నర్‌, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నది. గురువారం రాత్రి తిరుమల చేరుకున్న ఆమె ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నది. అనంతరం రంగనాయకుల మండపంలో ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తాను. ఈ సారి ఒలింపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చానని, స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో త్వరలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభిస్తామని, యువతను ప్రోత్వహించేందుకే అకాడమీ ఏర్పాటు చేస్తున్నానని తెలిపింది. చాలా మంది యువత సరైన ప్రోత్సాహం లేక వెనుకబడుతున్నారని గుర్తు చేసింది. ప్రజలందరూ కోవిడ్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పీవీ సింధు టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.