అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Olympic Medal: ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్‌ను కొరికిన మేయ‌ర్‌.. అథ్లెట్‌కు మరో ప‌త‌కం

ఒలింపిక్స్‌లో మెడ‌ల్ ( Olympic Medal ) అందుకున్న త‌ర్వాత అథ్లెట్ల ఆ మెడ‌ల్స్‌ను కొర‌క‌డం స‌హ‌జం. కానీ తాజాగా క‌రోనా నేప‌థ్యంలో విధించిన ఆంక్ష‌ల ప్ర‌కారం ప‌త‌కాల‌ను నోట్లో పెట్టి కొర‌క‌రాదు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో సాఫ్ట్‌బాల్ ఈవెంట్‌లో జ‌పాన్ స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకున్న‌ది. న‌గోయ సిటీకి చెందిన అథ్లెట్ మియూ గోటో ఓ కార్య‌క్ర‌మంలో త‌న మెడ‌ల్‌ను స్థానిక మేయ‌ర్‌కు అంద‌జేసింది. ఆ క్ష‌ణంలో ఉద్వేగానికి లోనైన మేయ‌ర్ ట‌కాషి క‌వామురా .. తొంద‌ర‌పాటులో ఆ బంగారు ప‌త‌కాన్ని నోట్లో పెట్టి కొరికేశారు. దీంతో ఆన్‌లైన్‌లో ఆ మేయ‌ర్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం సాగింది. మేయ‌ర్ ట‌కాషి కోవిడ్ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఒలింపిక్స్ అధికారులు స్పందించారు. గోటో అందుకున్న మెడ‌ల్ స్థానంలో మ‌రో కొత్త మెడ‌ల్‌ను ఇవ్వ‌నున్న‌ట్లు అధికారులు చెప్పారు. అయితే ప‌త‌కాన్ని కొరికిన ఘ‌ట‌న ప‌ట్ల మేయ‌ర్ ట‌కాషి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. మేయ‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరును జ‌పాన్‌కు చెందిన ఇత‌ర అథ్లెట్లు కూడా ఖండించారు. 72 ఏళ్ల మేయ‌ర్ ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేద‌ని సుమారు ఏడు వేల ఫిర్యాదులు వ‌చ్చాయి. మేయ‌ర్ అన్న స్థానాన్ని మ‌రిచి ప్ర‌వ‌ర్తించినందుకు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని, అయితే రీప్లేస్‌మెంట్ మెడ‌ల్ కోసం తానే మొత్తం ఖ‌ర్చును పెట్టుకోనున్న‌ట్లు ఆ మేయ‌ర్ తెలిపారు.