తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా బుధవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆలయంలోని రంగనాయకుల మండపంలోకి సేనాధిపతి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
విశిష్టత..
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
సూర్యాస్తమయం తరువాతే..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.
అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
అంకురార్పణ క్రమం..
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు.
అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, స్కంద , ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.
ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు.
ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.
కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, తిరుమల చిన్న జీయర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు మల్లీశ్వరి, విద్యాసాగర్ రావు, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు ఇతర అధికారులు పాల్గొన్నారు.