తెలంగాణ

ఆస‌రా పెన్ష‌న్లు.. 57 ఏండ్లు నిండిన వారి నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం

గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆస‌రా పెన్ష‌న్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టికే జీవో జారీ కాగా, ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నిన్న‌ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. 57 ఏండ్లు నిండి అర్హులైన వారు ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు మీ-సేవ‌, ఈ-సేవ కేంద్రాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుతో పాటు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌ను త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాలి. ఆస‌రా పెన్ష‌న్ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారి నుంచి స‌ర్వీసు రుసుం వ‌సూలు చేయొద్ద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు గ్రామీణ పేద‌రిక నిర్మూల‌నా సంస్థ ( SERP ) మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఆస‌రా పెన్ష‌న్ల కింద‌ రూ.2,116, అదే దివ్యాంగులకు రూ.3,116 ను ప్రభుత్వం అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం 65 ఏండ్లు నిండిన వారికి ఆస‌రా పెన్ష‌న్లు అందుతున్నాయి. తాజాగా తీసుకున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ల‌క్ష‌లాది మందికి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది.

ఆస‌రా పెన్ష‌న్ పొందాలంటే..

  1. దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు.
  2. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2 లక్షలు మించి ఉండకూడదు.
  3. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులు కారు.
  4. ఓటర్‌ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు.
  5. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులు.
  6. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరాకు అనర్హులు.