రాబోయే రోజుల్లో పీఎం గతిశక్తి ప్రణాళికను ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.100లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ అనీ, ఇది సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పనకు పునాది వేస్తుందని, ఆర్థిక వ్యవస్థకు సమగ్ర బాటలు అందిస్తుందని చెప్పారు. గతి శక్తి స్థానిక తయారీదారులకు ప్రపంచంతో పోటీపడేందుకు సహాయపడుతుందన్నారు. కొత్త భవిష్యత్ ఎకనామిక్ జోన్స్ అవకాశాలను కూడా అభివృద్ధి చేస్తుందన్నారు. రూ.100లక్షల కోట్ల గత శక్తి చొరవ యువతకు ఉపాధి అవకాశాలను తెస్తుందని, సంపూర్ణ మౌలిక సదుపాయాల వృద్ధికి సహాయపడుతుందన్నారు.
మూడు బిలియన్ డాలర్ల ఫోన్ల ఎగుమతి
భారతదేశం ఏడు సంవత్సరాల క్రితం 8 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్‌లను దిగుమతి చేసుకుందని, ఇప్పుడు మూడు బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేస్తుందని ప్రధాని తెలిపారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో పాటు, మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారతదేశం సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అత్యాధునిక ఆవిష్కరణలు, కొత్త తరం టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ స్థాయి ఉత్పత్తుల తయారీ కోసం మనం కలిసి పనిచేయాల్సి ఉందన్నారు.