హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీజేపీ భావిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ధీటుగా తాము కూడా దూసుకుపోవాలనే ఆలోచనతో బీజేపీ నేతలున్నారు. అధికార పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఈనెల 16న హుజురాబాద్‌లో బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కేడర్‌ను సమాయత్తపరుస్తున్నారు. జిల్లా మంత్రులు కూడా అక్కడే మకాం వేశారు.
ఇలా గులాబీ దళం ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తుండటం, ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చుననే ఊహాగానాల నేపథ్యంలో.. పకడ్బందీ కార్యాచరణను రూపొందించేందుకు బీజేపీ నేతలు సిద్ధమౌతున్నారు. ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల తేదీని ఎప్పుడు ప్రకటించినా ఆ వెంటనే పాదయాత్ర ఆ నియోజకవర్గానికి చేరుకునేలా రూట్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నారు. ఈలోపు వివిధ రూపాల్లో కార్యక్రమాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని కూడా భావిస్తున్నారు. ఉప ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే ప్రచార ప్రణాళికను రూపొందించుకుని దానికనుగుణంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.
‘స్థానిక’పట్టు సడలకుండా..
టీఆర్‌ఎస్ టికెట్‌పై హుజురాబాద్ నుంచి వరసగా ఆరు పర్యాయాలు గెలుపొందిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో.. నిన్నమొన్నటి వరకు ఆయనతో కలిసి పనిచేసిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. రాజకీయ అవసరాలు, ఇతర ప్రయోజనాల కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీ వైపే నిలిచే అవకాశా లు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినం ఈటల కూడా తనవైన సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. మొన్నటివరకు తనతో ఉన్నవారు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ కేడర్‌తో మమేకమై టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇదే జిల్లాకు చెందినవారు కావడంతో ఆయనకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో స్థానిక పరిస్థితులపై అవగాహనతో రాజకీయ సమీకరణాలకనుగుణంగా ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలతో తలపడాలని భావిస్తున్నారు.