ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు సీఎం జగన్ కిట్లు పంపిణీ చేయనున్నారు.
సీఎం సభకు చురుగ్గా ఏర్పాట్లు
స్థానిక జెడ్పీ హైస్కూలులో ఈ నెల 16న జరగనున్న ముఖ్యమంతిర వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులను మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు శనివారం పరిశీలించారు. అధికారులకు మంత్రులు పలు సూచనలిచ్చారు. తరగతి గదులు, ఫర్నిచర్, పెయింటింగ్స్, మరుగుదొడ్లను, ‘నాడు–నేడు’ పైలాన్‌ను పరిశీలించారు. సభకు హాజరయ్యే విద్యార్థులకు సరిపడేలా చిన్న సైజు మాస్కులు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు.
‘నాడు–నేడు’లో భాగంగా 10 రకాల మౌలిక సదుపాయాలు బాగా ఏర్పాటు చేశారని మంత్రి సురేష్ ప్రశంసించారు. శుక్రవారం అర్ధరాత్రి, శనివారం సాయంత్రం కురిసిన వర్షాలు అడ్డంకిగా మారినప్పటికీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పాఠశాల ఆవరణలో భారీ వాటర్ ప్రూఫ్ షెడ్డును నిర్మించారు. షెడ్డు పరిసరాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మోటార్లు ఏర్పాటు చేసి తోడుతున్నారు. వర్షాలకు పాఠశాల ఆవరణ చిత్తడిగా మారింది. పాఠశాల ముఖద్వారం వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచి హెలిప్యాడ్ వరకూ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, అమలాపురం ఆర్డీఓ వసంత రాయుడు, డీఎస్పీ వై.మాధవరెడ్డి, డీఈఓ ఎస్.అబ్రహం తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.