- మౌలిక సదుపాయాలు, ఉద్యోగావకాశాల కల్పనకు ప్రణాళికను ప్రకటించిన మోదీ
- రాబోయే 25 ఏండ్లు అమృత ఘడియలు
- సమిష్టి కృషితో నవభారతాన్ని సాధిద్ధాం
- ఇంధన రంగంలో 2047కల్లా స్వావలంబన
- కొత్తగా నేషనల్ హైడ్రోజన్ మిషన్
- 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లు
- స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని
భారతదేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొనే నాటికి ఒక ప్రబల శక్తిగా ఎదగాలని, అందుకు ప్రతీ ఒక్కరు సంకల్పం తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగావకాశాల పెంపు కోసం ‘ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ పేరుతో రూ.100 లక్షల కోట్ల భారీ ప్రణాళికను ప్రకటించారు. గతిశక్తిని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నవ, సుదృఢమైన భారతదేశ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. దీనితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను వెల్లడించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మోదీ ఆదివారం ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న, పతకాలు సాధించిన యువ క్రీడాకారులకు గౌరవంగా కరతాళ ధ్వనులు చేయాలని ప్రజలను కోరారు. రాబోయే 25 ఏండ్లు భారతదేశానికి ‘అమృత ఘడియలు’ అని అభివర్ణించారు. ‘ఈ అమృత ఘడియల్లో కొత్త లక్ష్యంతో ముందుకెళ్దాం. దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం. నవభారత నిర్మాణంలో గ్రామాలు, పట్టణాలు అన్న తేడాలు వద్దు. ప్రజల జీవనంలో ప్రభుత్వం అనవసర జోక్యం వద్దు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని పరిపూర్ణంగా సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అందుకే సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదాలకు ‘సబ్ కా ప్రయాస్’ను కూడా జోడిద్దాం. నవభారత నిర్మాణ లక్ష్యాన్ని సమష్టి కృషితోనే సాధించగలం’ అని అన్నారు. మోదీ మొత్తం 90 నిమిషాలు మాట్లాడారు. ఉగ్రవాదం, విస్తరణవాదం నుంచి దేశం సవాళ్లను ఎదుర్కొంటున్నదని చెప్పారు. నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇంధన రంగంలో 2047కల్లా స్వయం స్వావలంబన సాధించడమే లక్ష్యమన్నారు. అమృత మహోత్సవాల్లో మొదటి 75 వారాల్లో 75 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. బాలికల కోసం దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆగస్టు 14ను దేశవిభజన గాయాల స్మారక దినంగా జరుపుకొందామని పునరుద్ఘాటించారు.