visaka-drugs
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

విశాఖ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ లు

విశాఖ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న కొందరిని సీబీఐ అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ నెల 16న బ్రెజిల్ దేశం నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీగా డ్రగ్స్‌ ఉన్నట్లు ఇంటర్ పోల్ సమాచారం సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగుల డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రై ఈస్ట్‌తో కలిపి బ్యాగుల్లో డ్రగ్స్ ప్యాక్‌ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఈ డ్రగ్స్‌ కంటెయినర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు…అది ఎవరి పేరు బుక్ అయ్యిందో, ఎక్కడికి వెళ్తుందో ఆరా తీస్తున్నారు.సీబీఐ దర్యాప్తులో సంధ్య ఆక్వా పేరు బయటపడింది. డ్రగ్స్ తో వచ్చిన కంటెయినర్ సంధ్య ఆక్వా పేరిట బుక్ అయ్యింది. దీంతో సీబీఐ సంధ్య ఆక్వా కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. కస్టమ్స్ అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంధ్య ఆక్వా కార్యాలయంలో సీబీఐ తనిఖీలకు వెళ్లినప్పుడు వారికి యాజమాన్యం అంతగా సహకరించలేదని సమాచారం.

అయితే కాకినాడ జిల్లా మూలపేట ఎస్ఈజడ్ కాలనీలో సంధ్య ఆక్వాటెక్స్‌ బస్సు అనుమానాస్పదంగా పార్కింగ్‌ చేసి ఉండడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. సీబీఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ముఖ్యమైన ఫైల్స్‌, కంప్యూటర్‌ మదర్‌బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.డ్రగ్స్ పరీక్షల కోసం నమూనాలు సేకరించిన తర్వాత న్యాయమూర్తి సమక్షంలో 25 వేల కిలోల బ్యాగ్‌లను కంటెయినర్‌లో పెట్టి ప్రత్యేక సీల్‌ వేశారు. ప్రస్తుతం దీనిని వీసీటీపీఎల్‌ మెయిన్ గేటు వద్ద ఎగ్జామినేషన్‌ పాయింట్‌లో ఉంచారు. అయితే ఈ కంటెయినర్లో నమూనాలు సేకరిస్తున్న సమయంలో సంధ్య ఆక్వా ప్రతినిధులు, పెద్ద సంఖ్య జనం చేరి సీబీఐకి ఆటంకం కలిగించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన సీబీఐ సంధ్య ఆక్వా సంస్థ కార్యాలయంలో సోదాలు రికార్డుల్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ సంస్థపై కేసు నమోదు చేసింది. డ్రగ్స్ నమూనాలను దిల్లీలోని ల్యాబ్‌కు పంపించారు.కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐ అధికారులు ఎందుకు అప్పగించలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు.

బస్సులో తనిఖీలు చేసి తిరిగి దానికి కంపెనీ ప్రతినిధులకే ఎందుకు అప్పగించారని నిలదీశారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు సోదాలకు వస్తున్నారని సంధ్య ఆక్వా ప్రతినిధులకు ముందే సమాచారం అందిందన్నారు. అందుకే కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, రికార్డులను బస్సులో వేరొక చోటికి తరలించారని ఆరోపించారు. మూడు రోజులుగా మూలపేటలో ఉన్న బస్సును పోలీసులు తనిఖీలు చేసి సీబీఐకి అప్పగించకుండా…తిరిగి సంధ్య కంపెనీ వాళ్లకే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీబీఐకి ఆధారాలు దొరక్కుండా చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తునకు అడ్డుతగలాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయా? బస్సులో దొరికిన డాక్యుమెంట్లలో ఏముంది? అని పట్టాభి ప్రశ్నించారు. ఇంత పెద్ద వ్యవహారంలో పోలీసులు సీబీఐకి ఎందుకు సహకరించడంలేదని, దీని వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు.