తెలంగాణ

హుజూరాబాద్‌కు 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు: సీఎం కేసీఆర్

హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో రూ.2వేల కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. దళితబంధు పథక ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ‘హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయం భార‌త‌దేశ ద‌ళిత ఉద్య‌మానికి పునాది పడుతుంది. హుజూరాబాదే పునాది రాయి అవుతుంది. నియోజకవర్గంలో 21 వేల కుటుంబాలు ఉన్న‌ట్లు లెక్క ఉన్న‌ది. ఇంకో రెండు మూడు వేల కుటుంబాలు పెరిగే అవ‌కాశం ఉంది. రూ.500 కోట్లు ఇచ్చాం. మిగ‌తావి ఇస్తాం. రాబోయే 15 రోజుల్లో ఇంకో 2 వేల కోట్లు ఇస్తాం. ఈ డబ్బుతో అంద‌రూ ట్రాక్ట‌ర్లే కొనొద్దు. ఇది విజ‌య‌వంతం కావాలంటే అంద‌రం ఒక‌టే ప‌ని చేయొద్దు. ఈ స్కీంకు బ్యాంకుల‌కు లింకేజీ ఉండ‌దు. కిస్తీలు క‌ట్టే కిరికిరి లేదు. బాకీ ఇవ్వాలనే బాధ లేదు.’ అని అన్నారు.

‘ఆ ప‌ది ల‌క్ష‌ల‌ను ఎలా వాడాల‌నేది తెలుసుకోవాలి. మీకు వ‌చ్చిన ప‌ని, న‌చ్చిన ప‌ని, విజ‌యం సాధించ‌గ‌లిగే ప‌ని చేసుకోవాలి. ఇవాళ ఓ ట్రాక్ట‌ర్ మీద డ్రైవ‌ర్ ప‌ని ఉంటే.. నువ్వే ఓన‌ర్ అవుతావు. ఒక షాపులో ప‌ని చేస్తే నువ్వే ఓన‌ర్ కావొచ్చు. ఓ ఇద్ద‌రు ముగ్గురు క‌లిసి రైస్ మిల్లు పెట్టుకోవచ్చు. ద‌ళితుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెట్టి కాంట్రాక్టులు అప్ప‌గిస్తాం.’ అని చెప్పారు.