ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఈ రోజు హుజూరాబాద్ వేదికగా దళితబంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పథక అమలు తీరును వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘హుజూరాబాద్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి రెండు నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. హుజూరాబాద్ కాడ అందరికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలి. 25 ఏండ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. సిద్దిపేట దళిత చైతన్య జ్యోతి అని ప్రారంభించాం. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాటలు రూపొందించాం. 25 ఏండ్ల నుంచి నా మస్తిష్కంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అణగారిన, అణిచివేయబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో దళితుల మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివక్షకు గురయ్యాయి. అంబేద్కర్ పోరాటం వల్ల అన్ని పదవుల్లో రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు లభించాయి.’ అని సీఎం అన్నారు.
’అయినా ఇప్పటికీ సామాజిక వివక్ష ఎదుర్కొంటున్నారు. ఈ బాధ నుంచి విముక్తి కావాలి. ఇవాళ తెలంగాణ నుంచి చేసే పని దేశమంతా వ్యాపించాలి. ఇవాళ మేం చేస్తమంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. రెండు నెలల్లో హుజూరాబాద్‌లో పథకం అమలవుతుంది. మిగతా నియోజకవర్గాల్లో హుజూరాబాద్ దళితులే ఆదర్శం కావాలి. రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయి. రైతుబంధు తరహాలోనే దళిత బంధు వస్తది. గవర్నమెంట్ ఉద్యోగులైన దళిత సోదరులకు కూడా దళిత బంధు వర్తిస్తుంది.’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
‘ఒకాయనకు 4 ఎకరాల భూమి ఉంటే రైతుబంధు వస్తున్నది. రైతుబంధు లాగే దళిత బంధు వర్తిస్తుంది. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివరి వరుసలో ఉండి తీసుకోవాలి. మన దళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి మీద అప్పులు ఉన్నాయి. అటువంటి వారికి మొట్టమొదటి వరుసలో ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ పోతాం. ప్రభుత్వ ఉద్యోగులకు దళితబంధు ఇచ్చే హామీ నాది. రెండు పూటలు పస్తులుండే వాళ్లు లక్షల మంది ఉన్నారు. వారు ముందుగా తీసుకోవాలి. అత్యధికంగా జనాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలే. 75 లక్షల జనాభా ఉంది. అతి తక్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలే. ఇది ప్రజాస్వామ్యం అయితే ప్రజలు ప్రభువులు అయితే దళితులు ఎందుకు ప్రభువులుగా లేరు. ఈ వివక్ష ఎన్ని శతబ్దాలు కొనసాగలే. ఇది ఉండకూడదు.’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.