తెలంగాణ ముఖ్యాంశాలు

భెల్‌కు తెలంగాణ బాసట

  • భారీ కాంట్రాక్టుతో ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకట్ట
  • రూ.35వేల కోట్ల పనులను అప్పగించిన ప్రభుత్వం
  • విద్యుత్తు ప్లాంట్లకు యంత్రాలు అందిస్తున్న బీహెచ్‌ఈఎల్‌
  • పట్టుబట్టి నవరత్నానికి మెరుగులద్దిన సీఎం కేసీఆర్‌

రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రూ.50వేల కోట్ల వ్యయంతో యాదాద్రిలో 4,000 మెగావాట్లు, మణుగూరులో 1080 మెగవాట్లు, పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. మొత్తం 5880 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణ పనులను కాంట్రాక్టుకు అప్పగించే ప్రక్రియను టీఎస్‌ జెన్‌కో చేపట్టింది. కాంట్రాక్టును చేజిక్కించుకొనేందుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడ్డాయి. ఈ జాబితాలో టాటాలు మొదలు అదానీ, అంబానీ, ఎల్‌ అండ్‌ టీ వంటి భారీ కంపెనీలు కూడా ఉన్నాయి. కొన్ని కంపెనీలు కాంట్రాక్టు కోసం జెన్‌కో అధికారులపై.. ఒకానొక సందర్భంలో సీఎం కేసీఆర్‌పై కూడా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే ప్రభుత్వరంగ సంస్థలకు అండదండలివ్వాలన్న స్పష్టమైన ఆలోచనతో ఉన్న సీఎం కేసీఆర్‌ ఎక్కడా ఆ ఒత్తిళ్లకు లొంగలేదు. ప్రభుత్వరంగ సంస్థకే ఈ పనులను అప్పగించాలన్న పట్టుదలతో బీహెచ్‌ఈఎల్‌ వైపు మొగ్గు చూపారు. బీహెచ్‌ఈఎల్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి రూ.35వేల కోట్ల విలువైన పనులను అప్పగించారు. వాస్తవానికి ఆ సమయంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరంచేస్తూ, కొన్నింటిని అమ్మకానికి పెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌ను కూడా వదిలించుకోవాలని చూసినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ కాంట్రాక్టుతో దేశవ్యాప్తంగా ఉన్న బీహెచ్‌ఈఎల్‌ యూనిట్లకు ప్రాణం పోసినట్టయింది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో విద్యుత్తు ప్లాంట్లకు అవసరమైన అన్ని పరికరాలు, భారీ యంత్రాలను బీహెచ్‌ఈఎల్‌ యూనిట్లు సమకూరుస్తున్నాయి. బీహెచ్‌ఈఎల్‌ తిరుచ్చి యూనిట్‌ నుంచి బాయిలర్లు, హరిద్వార్‌ నుంచి టర్బయిన్లు, భోపాల్‌ నుంచి ఎలక్ట్రికల్‌ పరికరాలు సరఫరా అవుతుండగా, హైదరాబాద్‌ యూనిట్‌ నుంచి రొటేటింగ్‌ పరికరాలను అందిస్తున్నారు.

మొత్తం రూ. 35 వేల కోట్ల పనులు
రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రధాన విద్యుత్తు ప్లాంట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. యాదాద్రి విద్యుత్తు ప్లాంట్‌లో రూ.20వేల కోట్ల విలువైన పనులు, పాల్వంచలో రూ.5వేల కోట్ల పనులు, భద్రాద్రి ప్లాంట్‌కు సంబంధించి మరో రూ.10వేల కోట్ల పనులను మొత్తంగా రూ.35వేల కోట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారు.

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు నవరత్నాల వంటి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, పెట్టుబడుల ఉపసంహరణ పేరిట వాటిని అమ్మకానికి పెడుతుండగా.. అటువంటి ఓ సంస్థకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీ కాంట్రాక్టును అప్పగించి దాని మనుగడకు భరోసా కల్పించారు. బీహెచ్‌ఈఎల్‌కు ఏకంగా రూ.35వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను అప్పగించారు.

సీఎం నిర్ణయం గర్వకారణం
మిగులు విద్యుత్తు రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలంటే.. కొత్త థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్రం వచ్చిన మొదట్లోనే సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అందులో భాగంగానే భద్రాద్రి, పాల్వంచ, యాదాద్రి థర్మల్‌ ప్రాజెక్టుల ద్వారా 5,880 మెగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు వేశారు. సుమారు రూ. 50 వేల కోట్లతో చేపట్టే ఈ పనులను అప్పగించాలని.. చాలా ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. ఒకింత ఒత్తిడికూడా చేశాయి. సీఎం కేసీఆర్‌ పట్టుదలతో.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు ఇవ్వాలని.. మన సంస్థలను మనమే ప్రోత్సహించకపోతే ఎలా అని అన్నారు. అందుకే పట్టుబట్టి బీహెచ్‌ఈఎల్‌కు రూ. 35 వేల కోట్ల పనులను అప్పగించారు. వేరే ఎవరైనా అయితే ప్రైవేటు సంస్థలకే అప్పగిస్తారు. కానీ.. సీఎం కేసీఆర్‌ నమ్మకంతో బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించడం గర్వంగా అనిపిస్తున్నది. ఇప్పటికే పాల్వంచలో విద్యుత్తు కేం ద్రాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో 270 మెగావాట్ల సామర్థ్యంతో 3 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాయి. మరో రెండుయూనిట్లు ఈ డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తాయి. యాదాద్రి పనులు వేగంగా సాగుతున్నాయి. బీహెచ్‌ఈఎల్‌కూడా పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం నమ్మకం మేరకు పనులను నాణ్యతతో చేస్తున్నారు.

  • దేవులపల్లి ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ