అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌కు ఆయుధాల అమ్మకాలను నిలిపివేశారు. ఆ దేశం తాలిబన్ల ఆధీనంలోకి రావడంతో బైడెన్ పాలనా యంత్రాంగం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌కు పెండింగ్‌లో ఉన్న లేదా పంపిణీ చేయని ఆయుధాల బదిలీని సమీక్షిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ రాజకీయ, సైనిక వ్యవహారాల బ్యూరో రక్షణ కాంట్రాక్టర్లకు తెలిపింది. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో వారి అనుకూలతను నిర్ణయించడానికి పెండింగ్‌లో ఉన్న ఆయుధాల ఎగుమతి లైసెన్స్‌లు, ఇతర ఆమోదాలను డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్స్ సమీక్షిస్తున్నాయి’ అని ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ పరికరాల ఎగుమతిదారులకు దీనిపై అప్‌డేట్‌ను రాబోయే రోజుల్లో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుందని అందులో పేర్కొంది.
కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో అష్రఫ్ ఘనీ పరిపాలన పతనం నేపథ్యంలో తాలిబన్లు అమెరికాకు చెందిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ-29 సూపర్ టుకానో అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్, మైన్-రెసిస్టెంట్ హమ్వీస్‌తో పాటు అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌లు, ఎం 6 రైఫిల్స్ ఇందులో ఉన్నట్లు సమాచారం. 2020 వరకు ఆఫ్ఘనిస్థాన్‌కు 227 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా అమ్మినట్లు డేటా ద్వారా తెలుస్తున్నది.