Karvy MD Arrest |తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పలు రకాల ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థ కార్వీ మేనేజింగ్ డైరెక్టర్ పార్ధసారధిని సీసీఎస్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారని సమాచారం. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు అధికారులను తప్పుదోవ పట్టించి తాను తీసుకున్న రుణాలను అక్రమంగా వాడుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
హెచ్డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకుల ఫిర్యాదు
సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోవడంతో హైదరాబాద్ పోలీసులకు హెచ్డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకుల అధికారులు ఫిర్యాదు చేశారు. రుణాల చెల్లింపుల్లో జాప్యంపై ప్రస్తుతం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలియవచ్చింది.
రూ.780 కోట్ల మేరకు బ్యాంకులకు టోకరా?
పార్ధసారధి రూ.780 కోట్ల మేరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. వీటితోపాటు రూ.720 కోట్ల కస్టమర్ల నిధులను కూడా తారుమారు చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఇంతకుముందు షేర్ల అక్రమ లావాదేవీలకు పాల్పడినందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. గతంలో కార్వీపై నిషేధం విధించింది.