తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. దర్శనం టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలపై టీటీఢీ నిఘా, భద్రతా విభాగం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గత రెండు నెలల్లో 25 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 41 మందిని అరెస్టు చేశారు.
జులై, ఆగస్టు నెలల్లో భక్తులకు స్వామివారి దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న దళారులను టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో కొంతమంది ప్రజా ప్రతినిధుల నకిలీ లేఖలు, నకిలీ వెబ్‌సైట్లు, ట్రావెల్ ఏజెన్సీలు భక్తులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వారిపై తిరుమల, తిరుపతిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు.