టీడీపీ నేత నారా లోకేష్ తీరుపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా ఏటి అగ్రహారం ఘటనను లోకేష్ తప్పుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొంది. కానిస్టేబుల్‌పై ఫిర్యాదు రాగానే సస్పెండ్ చేశామని పోలీసు అధికారుల సంఘం ఆదివారం తెలిపింది. కాగా లోకేష్ తప్పుడు ప్రచారం ఎంతవరకు సమంజసమని పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు.
ఈ ఘటనను లోకేష్ వక్రీకరిస్తున్నారని తెలిపారు. యువతిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడని ఆయన ప్రచారం చేయటం ఎంతవరకు సరియైనదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం లోకేష్ ఆడే డ్రామాల వల్ల ఆ యువతి, ఆమె కుటుంబం మానసిక వేదనకు గురవుతోందని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యంగా ఆమె కుటుంబ గౌరవానికి నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు.