రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి భారత వాతావరణ కేంద్రం ( IMD ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ అంటే..
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేస్తారు. 7.5 నుండి 15 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేస్తారు. 15 నుంచి 33 మిల్లిమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
గురువారం ఉదయం నుంచి నగరంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. గొల్కోండలో అత్యధికంగా 14 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జగిత్యాల జిల్లాలోని సిరికొండలో అత్యధికంగా 87.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.