అఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 13 మంది చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. పేలుడు విషయాన్ని యూఎస్ మిలటరీ ధ్రువీకరించింది. పేలుళ్లలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో ఇంకా తెలియరాలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విమానాశ్రయం వద్ద దాడులు జరగొచ్చని ఉదయమే అమెరికా రక్షణశాఖ హెచ్చరించింది. ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో తమ దేశ పౌరులు కాబూల్ విమానాశ్రయాన్ని తక్షణమే విడిచివెళ్లాల్సిందిగా పశ్చిమ దేశాలు హెచ్చరించాయి.
తాలిబాన్ దేశ పగ్గాలను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అమెరికా, ఇండియా, బ్రిటన్, కెనడా తదితర దేశాలు తమ జాతీయులను, ఆఫ్ఘన్ వాసులను తరలించే కార్యక్రమాన్ని చేపట్టాయి. అఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై అత్యవసర చర్చలు జరిపిన జీ-7 దేశాలు, ఆగస్టు 31 తర్వాత కాబూల్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి తాలిబాన్ సురక్షితమైన మార్గానికి హామీ ఇవ్వాలని ఏకగ్రీవంగా అంగీకరించాయి. కాబూల్ నుంచి అమెరికా ఇప్పటివరకు 82,000 మందికి పైగా ప్రజలను తీసుకెళ్లినట్లు ఆ దేశ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.