ముఖ్యాంశాలు

హుజురాబాద్ బరిలో నలుగురు రాజేందర్ లు పోటీ..ఓటర్లు ఎవరికీ ఓటు వేస్తారో..?

హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నలుగురు రాజేందర్ లు పోటీపడుతున్నారు. ఇప్పుడు ఇదే ఈటెల రాజేందర్ కు తలనొప్పిగా మారింది. ఓటర్లు ఎవరికీ ఓటు వేస్తారో అని టెన్షన్ పడుతున్నారు. కేవలం వారి పేర్లే కాదు వారి ఇంటి పేర్లు కూడా ‘ఈ’తోనే ప్రారంభం కావడం గమనార్హం. దీంతో ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనన్న ఆందోళన ఇప్పుడు బీజేపీ వర్గాల్లో మొదలైంది.

ఇమ్మడి రాజేందర్‌ (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), ఈసంపల్లి రాజేందర్‌ (న్యూ ఇండియా పార్టీ), ఇప్పలపల్లి రాజేందర్‌ (ఆల్‌ఇండియా బీసీ ఓబీసీ పార్టీ)లు నామినేషన్లు సమర్పించారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు 13 మంది, 43 మంది స్వతంత్రులతో పాటు మొత్తంగా 61 మంది 92 సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పోటీదారులు స్థానిక ఆర్డీవో కార్యాలయానికి తరలి వచ్చారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులతోపాటు ఇతర గుర్తింపు పొందిన పలు పార్టీల తరఫున కొందరు నామినేషన్లు వేయగా.. ఎక్కువ మంది స్వతంత్రులు ఇక్కడ బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపారు. ఈ నెల 7వ తేదీ వరకు 15 మంది తమ నామినేషన్లను ఎన్నికల అధికారి రవీందర్‌రెడ్డికి అందించగా ఆఖరు రోజున ఏకంగా 46 మంది దాఖలు చేశారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణకు అవకాశముంది. ఆ తర్వాత పోటీలో ఎంతమంది ఉంటారనేది తెలియనుంది.