ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

రైతులపై కాల్పుల ఘటనకు 21 ఏళ్లు

 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి ధ్వజం

చంద్రబాబు అన్నదాతలపై కాల్పులు జరిపించి ముగ్గురిని పొట్టనబెట్టుకున్నారు

ఆయన తొలి నుంచి రైతు వ్యతిరేకి

రైతులకు ఉచిత విద్యుత్‌ అంటే హేళన చేశారు    

విద్యుత్‌ ధరలు తగ్గించాలని పోరాటం చేస్తున్న రైతులపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో చంద్రబాబు కాల్పులు జరిపించి నేటికి 21 ఏళ్లు పూర్తి అవుతాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తెలిపారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కాల్పుల్లో ముగ్గురు అన్నదాతలను పొట్టనబెట్టుకున్నారన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. బషీర్‌బాగ్‌ ఘటనను నేటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేదన్నారు.

బాబు తొలి నుంచి రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అంటే హేళన చేసిన చరిత్ర బాబు సొంతమన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల్లో ఘోర పరాజయం పాలయ్యాక మతి భ్రమించి ఉన్మాదిలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను దేశంలో అందరూ మెచ్చుకుంటుంటే చంద్రబాబు, ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు జరిగితే చూసి ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు.

పెట్రోల్, డీజిల్‌ మీద ఒకేసారి రూ.4 టీడీపీ ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. రూ.2.5 లక్షల కోట్లు అప్పులు చేసి.. ఒక్క కొత్త రోడ్‌ను వేయలేదని.. ఉన్న రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి సెస్‌తో వచ్చే ఆదాయంతో రోడ్లను బాగు చేయాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చంద్రబాబు తన హయాంలో అమ్మఒడి, నాడు–నేడు, ఆర్‌బీకేలు, సచివాలయాలు వంటి ఒక్క కార్యక్రమాన్ని అయినా చేపట్టారా అని ప్రశ్నించారు. 

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా.. 
ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా రూ. 1,04,241 కోట్లను ప్రజల ఖాతాల్లో జగన్‌ ప్రభు త్వం జమ చేసిందన్నారు. పరోక్షంగా మరో రూ.36 వేల కోట్లను ప్రజల జీవితాల మెరుగుకు వెచ్చించిందన్నారు. రెండు, మూడు రకాల పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వారిని లెక్కిస్తే రాష్ట్రంలో ఆరు కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారన్నారు. రాష్ట్రానికి ఆదాయం రాకుండా బాబు తన మనుషుల ద్వారా ఆర్బీఐ, కేంద్రానికి ఫిర్యాదులు చేయించడంతోపాటు బ్యాంకర్ల దగ్గరకు వెళ్లి ప్రభుత్వానికి అప్పులు ఇవ్వొద్దని చెబుతున్నారన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.50 లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఆ డబ్బులో 10 శాతం కూడా ప్రజలకు చేరకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినందుకు ధర్నా చేస్తారా అని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లీటర్‌ డీజిల్, పెట్రోల్‌పై రూ.25 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి చేయలేదన్నారు.