ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

13 మందికి భాషా సేవా పురస్కారాలు అందించిన లక్ష్మీ పార్వతి

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు, సంస్కృత భాష అభివృద్ధికి కృషి చేసిన 13 మందికి గిడుగు రామమూర్తి భాషా పురస్కారాలు తెలుగు, సంస్కృత అకాడమీ అందించింది. ఈ కార్యక్రమంలో తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.

తెలుగు, సంస్కృత అకాడమీ ఎంపిక చేసిన.. ఆచార్య రఘునాథ శర్మ, డాక్టర్ కాంపల్లె రవిచంద్రన్, మొవ్వ వృషాద్రిపతి, డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి, వాడ్రేపు సుందర రావు, డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ, డాక్టర్ ఉపద్రష్ట వెంకటరమణ మూర్తి, ఎస్. సుధారాణి, జీఎస్ చలం కెంగార మోహన్, శ్రీమతి షహనాజ్ బేగం, మల్లిపురం జగదీష్, పచ్చా పెంచలయ్యలకు లక్ష్మీపార్వతి, ఆదిమూలపు సురేష్ గిడుగు రామకృష్ణ భాషా పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ పాల్గొన్నారు.