ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయనం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇలాంటి వాళ్లు కొవాగ్జిన్( Covaxin ) వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని ఈ అధ్యయనం తేల్చింది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడని వాళ్లు రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకుంటే వచ్చే యాంటీబాడీలు.. కరోనా సోకిన వాళ్లు ఒక్క డోసు తీసుకున్నా అదే స్థాయిలో వస్తున్నాయని ఐసీఎంఆర్ చెబుతోంది.
ఈ అధ్యయనం తాలూకు ఫలితాలను శనివారం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో పబ్లిష్ చేశారు. మేము జరిపిన అధ్యయనానికి సంబంధించి ప్రాథమికంగా తేలింది ఏంటంటే.. ఇప్పటికే కరోనా సోకి తగ్గిపోయిన వాళ్లకు సింగిల్ డోసు బీబీవీ152(Covaxin) వ్యాక్సిన్ చాలు. దీని వల్ల వ్యాక్సిన్ కొరతను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది అని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది.
అధ్యయనం ఎలా చేశారు?
ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా SARS-CoV-2కు సంబంధించిన యాంటీబాడీలు డే జీరో (వ్యాక్సిన్‌కు ముందు)న, కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28వ రోజున, 56వ రోజున ఎలా ఉన్నాయో పరిశీలించారు. దీనికోసం 114 మంది రక్త నమూనాలను సేకరించారు. వీళ్లంతా కరోనా బారిన పడినవాళ్లు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే మధ్యలో చెన్నైలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు.
ఇద్దరిలో తప్ప మిగతా వాళ్లందరిలోనూ కొవాగ్జిన్ సింగిల్ డోసు తీసుకున్న తర్వాత యాంటీబాడీల వృద్ధి చాలా ఎక్కువగా ఉంది. కరోనా సోకని వాళ్లు రెండు డోసుల కొవాగ్జిన్ తీసుకుంటే ఎన్ని యాంటీబాడీలు వృద్ధి చెందుతాయో వీళ్లలోనూ అన్ని కనిపించినట్లు ఐసీఎంఆర్ అధ్యయనం తేల్చింది.