అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

Avani Lekhara: ఇండియ‌న్ స్పోర్ట్స్‌కు ఇది స్పెష‌ల్ మూమెంట్‌: ప్ర‌ధాని మోదీ

టోక్యోలో జ‌రుగుతున్న పారాలింపిక్స్ షూటింగ్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచి చ‌రిత్ర సృష్టించిన అవ‌ని లెఖారా( Avani Lekhara )పై ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. పారాలింపిక్స్‌లో గోల్డ్ గెలిచిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా అవ‌ని రికార్డు క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు ఫైన‌ల్లో ప్ర‌పంచ రికార్డును ఈక్వ‌ల్ చేస్తూ 249.6 పాయింట్లతో ఆమె టాప్‌లో నిలిచింది. మొత్తంగా పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన నాలుగో ఇండియ‌న్ అవ‌ని. గ‌తంలో 1972లో స్విమ్మ‌ర్ ముర‌ళీకాంత్‌, 2004, 2016ల‌లో జావెలిన్ త్రోయ‌ర్ దేవేంద్ర ఝాఝారియా, 2016లో హైజంప‌ర్ తంగ‌వేలు మ‌రియ‌ప్ప‌న్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించారు.

అవ‌ని సాధించిన ఈ అరుదైన ఘ‌న‌త‌పై మోదీ సోమ‌వారం ఉద‌యం ట్వీట్ చేశారు. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌. ఎంతో క‌ష్ట‌ప‌డి గోల్డ్ మెడ‌ల్ సాధించినందుకు శుభాకాంక్ష‌లు. ఇది షూటింగ్ ప‌ట్ల నీకు ఉన్న అంకిత‌భావం వ‌ల్లే సాధ్య‌మైంది. ఇండియ‌న్ స్పోర్ట్స్‌కు ఇదో ప్ర‌త్యేక సంద‌ర్భం అని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్‌, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ మినిస్ట‌ర్ అనురాగ్ ఠాకూర్‌, పారాలింపియ‌న్ దీపా మాలిక్ కూడా అవ‌నిపై ప్ర‌శంస‌లు కురిపించారు.