రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగింది. కానీ ఉత్పాదకత, ఆదాయం కూడా పెరగాల్సిన అవసరం ఉందని ఐటీ, మున్సిపల్ శాఖ కేటీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అగ్రి హబ్‌ను మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డికలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ సూచనలు, మార్గదర్శకత్వంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం పట్ల ప్రేమ, సాగునీటి రంగంపై ఉన్న శ్రద్ధతో ఈ ఏడేండ్లలో తెలంగాణ వ్యవసాయ, సాగునీటి రంగంలో ఏ రాష్ట్రం సాధించని అద్వితీమయమైన విజయాలను సాధించింది. ప్రపంచం అబ్బురపడే విధంగా మూడున్నరేండ్ల కాలంలో కాళేళ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కృష్ణా, గోదావరి జీవనదుల్లోని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. సాగుకు యోగక్యమైన భూమికి నీరందించేందుకు కృషి చేస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడేండ్లలో ధాన్యం దిగుబడి పెరిగింది. ఇవాళ తెలంగాణ ధాన్య భాండాగారంగా మారిందన్నారు. రైతులకు అండగా ఉంటున్నాం. ఒకప్పుడు మనదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఆహార భద్రత ఒక సవాల్‌గా ఉండేది. ఈ జనాభాకు సరిపడా ఆహారం ఉత్పత్తి చేయగలుగుతామా? అనే సందేహం ఉండేది. ఇప్పుడు ఆహార భద్రతను సాధించాం. కానీ ప్రస్తుతం పోషాకాహార భద్రత ఒక సవాల్‌గా మారింది. కొవిడ్ వ్యాపించిన తర్వాత ప్రజలందరూ న్యూట్రిషన్ ఫుడ్‌పై మక్కువ చూపుతున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతుకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ అనేది రైతుకు చాలా ప్రాముఖ్యమైన విషయం. దేశంలో 55 నుంచి 60 శాతం మంది జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సబ్సిడీ మీద నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. రైతుబంధు రూపంలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నాం. ప్రతి రైతుకు జీవిత బీమా చేసి రైతు కుటుంబంలో ధీమా నింపుతున్నాం. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. గోడౌన్ల సామర్థ్యం 4 లక్షల నుంచి 26 లక్షల టన్నులకు పెరిగింది. పాలిహౌస్, మెక్రో ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇస్తున్నాం.
నినాదాలు అలానే మిగిలిపోతున్నాయి
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని లక్ష్యాలు, నినాదాలు అలానే మిగిలిపోతున్నాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2022 కల్లా రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని నినాదం ఇచ్చారు. ఇది ఆచరణలో సఫలమైందా? ఒరిగిందా? అంటే కాలేదనే చెప్పొచ్చు. కొంత వరకు మాత్రమే జరిగింది.
ఇన్నోవేషన్ ఎవరి సొత్తు కాదు..
రైతును మించిన ఇన్నోవేటర్ లేడు. ఇన్నోవేషన్ ఎవరి సొత్తు కాదు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. అగ్రిహబ్‌లో తెలుగు భాషకు పెద్దపీట వేయాలి. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలి. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్‌ను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణలో వ్యవసాయ రంగంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.