జాతీయం

రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ పేరు మార్పు

అసోంలోని రాజీవ్‌గాంధీ ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌ పేరును ఆ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. పేరులోంచి రాజీవ్‌గాంధీ పేరును తొలగించి ఒరాంగ్‌ నేషనల్‌ పార్కుగా మార్చాలని అసోం కేబినెట్‌ తీర్మానించింది. దేశంలో క్రీడాకారులకు అందించే రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవార్డు పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చిన విషయం తెలిసిందే.

రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ దేశంలోనే రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌కు పెట్టింది పేరు. జాతీయ పార్క్‌ పేరును మార్చాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆదివాసీ, టీ తెగ కమ్యూనిటీ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కేబినెట్‌ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ పేరును ఒరాంగ్‌ నేషనల్‌ పార్క్‌గా మార్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

దరాంగ్, ఉదల్‌గురి, సోనిత్‌పూర్ జిల్లాల్లో బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న జాతీయ ఉద్యానవనం ఇండియన్ రినోస్, రాయల్ బెంగాల్ టైగర్, పిగ్మీ హాగ్, అడవి ఏనుగులు, అడవి నీటి దున్నలకు ప్రసిద్ధి చెందింది. 79.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్క్‌ను 1985లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు. 1999లో జాతీయ ఉద్యానవనంగా అప్‌గ్రేడ్‌ చేశారు. 1992లో అభయారణ్యానికి రాజీవ్‌ గాంధీ పేరు పెట్టగా.. తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 2001లో రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనంగా మార్చింది.