కొన్ని కేసుల్లో వారి సాక్ష్యాన్ని కాదనలేం
వివాహిత ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు
బాధితురాలి బంధువులు, స్నేహితులు ఇచ్చే సాక్ష్యాలను తోసిపుచ్చలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టాన్ని అనుసరించి కొన్ని సందర్భాల్లో వారిని ప్రధాన సాక్ష్యులుగా కూడా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. వరకట్నం వేధింపులకు తాళలేక మానసిక వేదనతో గుజరాత్‌కు చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, అత్తింటివారు పెట్టిన మానసిక వేదనతోనే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడినట్టు బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. వీరి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్న గుజరాత్ హైకోర్టు నిందితులకు రెండేండ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్‌లు ఎస్‌ఏ నజీర్, క్రిష్ణ మురారితో కూడిన ధర్మాసనం గుజరాత్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
- వివాహితలపై దాడులు, వారి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులకు బయటి వ్యక్తులు సాక్ష్యులుగా ఉండటం చాలా అరుదు. ఒకవేళ, ఆ ఘటనలు చూసినప్పటికీ, వాళ్లు సాక్ష్యం చెబుతారో, లేదో కూడా తెలియదు.
- హింసకు గురవుతున్న బాధితురాలు ఆ విషయాలను తల్లిదండ్రులు, సోదరులు, బంధువులతో పంచుకోవడంలో ఆశ్చర్యపోయేది ఏమీలేదు.
- ఇలాంటి సందర్భాల్లో.. కేసుకు సంబంధించి బాధితురాలి బంధువులు చెప్పే విషయాలను సాక్ష్యాలుగా తీసుకోవడంలో తప్పేమీ లేదు. వారి సాక్ష్యాన్ని చట్టం అనుమతిస్తుంది. అయితే, ఆ సాక్ష్యాన్ని కూలంకషంగా ఆధారాలతో బేరీజు వేయాల్సి ఉంటుంది.