అంతర్జాతీయం ముఖ్యాంశాలు

గినియాలో సైనిక తిరుగుబాటు.. ప్రెసిడెంట్‌ అరెస్ట్‌

మరో దేశంలో ప్రభుత్వం పడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని కూలదోయగా, ఆఫ్రికా దేశమైన గినియాలో ప్రత్యేక సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. అధ్యక్షుడు ఆల్ఫా కోండేను అరెస్టు చేశారు. ఆయన ప్రభుత్వం రద్దయినట్లు ప్రకటించారు. దేశంలో కర్ఫ్యూ విధించారు. అధ్యక్షుడిని అరెస్టు చేసిన తర్వాత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని నిర్ణియించినట్లు గినియా ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా ప్రకటించారు.

దేశంలో ఒక ఒకే వ్యక్తి చేతిలో రాజకీయం అనేది ముగిసింది. ఇకపై రాజకీయాలను ఒక వ్యక్తికి అప్పగించబోమని, అధికారాన్ని ప్రజలకే అందిస్తామని చెప్పారు. రాజ్యాంగం కూడా రద్దయిందని తెలిపారు. దేశ సరిహద్దులతోపాటు, ఆకాశ మార్గాలను కూడా మూసివేశాని ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దేశంలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు (భారత కాలమానం ప్రకారం) క్యాబినెట్ సమావేశం ఉంటుందని చెప్పారు. దేశంలో గవర్నర్లు, ఇతర అత్యున్నత పదవుల్లో మిలటరీ అధికారులను నియమిస్తామని తెలిపారు. కాగా, దేశంలో తిరుగుబాటుకు సంబంధించి అధికారిక టెలివిజన్‌ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

కొనాక్రీలోని అధ్యక్ష భవనం వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల పరంపర గంటల తరబడి సాగినట్లు స్థానిక మీడియా తెలిపింది. సైనిక ఆక్రమణలు, తిరుగుబాటు చరిత్ర కలిగిన పశ్చిమాఫ్రికా దేశంలో భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి.