- ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్‌కు బైడెన్ సర్కారు అనుమతి
- వేలమంది భారతీయులకు లబ్ధి
వాషింగ్టన్, నవంబర్ 12: హెచ్-1బీ వీసాదారుల కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి జీవిత భాగస్వాములకు ‘ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్’ ఇచ్చేందుకు అంగీకరించింది. అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఐటీ నిపుణులుగా పనిచేస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ. ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ ఇచ్చే విధానాన్ని యూఎస్‌సీఐఎస్ నిషేధించడంతో వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు కోల్పోయారు. వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్‌ను ఆశ్రయించారు. ఆ సంఘం హోం లాండ్ సెక్యూరిటీస్ విభాగంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బైడెన్ సర్కారు సానుకూలంగా స్పందించి ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్‌కు అంగీకరించింది.