భావితరాలకు బంగారు బాటలు వేయండి.. గురుపూజోత్సవంలో మంత్రి సబిత
ప్రభుత్వ స్కూళ్లలోనూ ఘనంగా వార్షికోత్సవాలు.. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసలు
బాల్యంలో తాను పీర్ల కొట్టంలో చదువుకొన్నానని.. అక్కడ తనకు విద్య నేర్పిన గురువుల చలవ వల్లనే ఈరోజు మంత్రి స్థాయికి ఎదిగానని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. సమాజ ఉన్నతికి గురువులే మూలకారకులవుతారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలువేయాలని పిలుపునిచ్చారు. భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం రవీంద్రభారతిలో విద్యాశాఖ నిర్వహించిన గురుపూజోత్సవంలో మంత్రులు సబిత, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. కరోనావల్ల విద్యార్జనలో ఏర్పడిన అంతరాన్ని ఉపాధ్యాయులే పూరించాలని, డ్రాపౌట్లను తగ్గించాలని మంత్రి సబిత ఈ సందర్భంగా కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రైవేట్ స్కూళ్ల తరహాలోనే సర్కారు స్కూళ్లల్లోనూ ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, వెయ్యికి పైగా గురుకులాలను ప్రారంభించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారని మంత్రి సబిత గుర్తుచేశారు. ఈ ఏడాది 2.5 లక్షల మంది విద్యార్థులు సర్కారు స్కూళ్లల్లో చేరితే, వారిలో 1.5 లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చారని చెప్పారు. ఇంటర్ అడ్మిషన్లు లక్షకు చేరుకున్నాయని, డిగ్రీ ప్రవేశాల కోసం అవలంబిస్తున్న దోస్త్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ద్వారా 3,200 మంది విదేశాల్లో చదువుకుంటున్నారని మంత్రి వివరించారు.
పీర్ల కొట్టమే మా బడి..
బాల్యంలో తాను పీర్ల కొట్టంలో చదువుకున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తన పాతరోజులను గుర్తుచేసుకున్నారు. ఊర్లో స్కూల్ లేకపోవడంతో పీరీలు దాచిఉంచే కొట్టమే మాకు పాఠశాలగా ఉండేదని చెప్పారు. 5 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చి, ఇంటింటి తిరిగి పిల్లలందరికి సమీకరించి, అక్షరాలు దిద్దించిన గురువును మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో స్కూళ్ల రూపురేఖలను మార్చనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబ్రాది, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, వైస్‌చాన్స్‌లర్లు కట్టా నర్సింహారెడ్డి, రవీందర్, కుసుంబ సీతారామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ టీచర్లుగా నిలిచిన 111మందిని మంత్రి ఘనంగా సన్మానించారు. వీరికి రూ.10 వేల చెక్కు, ప్రశంసాపత్రం, మెడల్‌లను అందజేశారు. అంతకుముందు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన కాడెర్ల రంగయ్య, రామస్వామి వర్చువల్‌గా రాష్ట్రపతి నుంచి అవార్డులు అందుకోగా, వారికి రవీంద్రభారతిలో మంత్రుల చేతులమీదుగా అవార్డులు అందజేశారు.