భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి నియోజకవర్గానికి బయలుదేరుతూ మార్గ మధ్యలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్సారెస్పీ ఎస్ఈ శ్రీనివాస్, సీఈ సుధాకర్‌తో వర్షాలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు.
పలు అంశాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో భారీ వర్షాలున్నాయన్న వాతావరణశాఖ సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతాలు, నిండిన చెరువులపై దృష్టి సారించాలి. రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు.
అలాగే ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుంచి దిగువకు భారీగా నీటి విడుదల జరుగుతున్నందున దిగువ గ్రామాలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ని ఆదేశించారు.