తెలంగాణ ముఖ్యాంశాలు

సిరిసిల్లకు బయలుదేరిన డీఆర్‌ఎఫ్‌ బృందాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. కరీంనగర్‌ – కామారెడ్డి రహదారితో పాటు వెంకంపేట రోడ్‌పై వరద ప్రవహిస్తోంది. పలు కాలనీలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో వరద పరిస్థితిపై రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల దృష్ట్యా రాజన్న సిరిసిల్లకు డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు రెండు బృందాలు హైదరాబాద్‌ నుంచి సిరిసిల్లకు బయలుదేరి వెళ్లాయి. ఈ బృందాలు వరద సహాయక చర్యలు చేపట్టనున్నాయి.

కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‌ల‌తో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ వరదల దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వరద ముంపున‌కు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు. ప్రజలెవ‌రూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా వేములవాడలో 213 మిల్లీమీటర్లు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 174 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.