తెలంగాణ ముఖ్యాంశాలు

చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్‌

రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. చేనేత, జౌళీ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలు.. వాటి అమలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో చేనేత కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పలు అంశాలపై గత నెలలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, చేనేత జౌళీశాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ సమీక్షించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించి, చేనేత కార్మికుల విజ్ఞప్తులపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పలు అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేరెన్నికగన్న చేనేత రంగాన్ని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వివిధ రాష్ట్ర ప్రాయోజిత పథకాలు రూపొందించి అమలు చేస్తుందన్నారు. అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా నేత కార్మికులు, అనుబంధ కార్మికుల నెలవారి ఆదాయాన్ని పెంపొందించి.. జీవన ప్రమాణాలను అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు.-

చేనేత సహకార సంఘాలకు 20శాతం హాంక్ నూలు, రంగులు సబ్సిడీ పథకం కింద నిధుల విడుదల, చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన పావలావడ్డీ పథకం, సంఘాలకు చెల్లించాల్సిన మార్కెటింగ్‌ ప్రోత్సాహక పథకం కింద నిధుల విడుదల, టెస్కో ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు, చేనేత సహకార సంఘాలకు టెస్కో చెల్లించాల్సిన నిధులు, చేనేత మిత్ర పథకం ద్వారా కార్మికులకు సబ్సిడీ నిధుల, క్యాష్ క్రెడిట్ రుణాల చెల్లింపు, త్రిప్టు ఫండ్‌ పథకం పునః ప్రారంభం తదితర అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చేనేత, జౌళీశాఖ అధికారులతో పథకాల వారీగా సమీక్షించి, ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికుల సంక్షేమానికి వారు తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను సంపూర్ణంగా ఆమోదిస్తూ, ఆయా పథకాల అమలుకు సంబంధించిన నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి రూ.73.50కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. ఆయా సంఘాలు, కార్మికులకు తక్షణం నిధులు విడుదల చేసేందుకు శాఖాపరమైన అన్ని చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

పథకాలు అమలతో చేనేత కార్మికుల తలసరి ఆదాయం పెరుగడంతో పాటు చేనేత కార్మికులకు 365 దినాలు సంపూర్ణంగా పని కల్పించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. అలాగే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు చేనేత కార్మికుల నెలసరి ఆదాయం కనీసం రూ.15000లకు మించి పొందడానికి ఆస్కారం ఏర్పడిందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ విజన్ మేరకు రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు.